మియాపూర్, జూన్ 1 : వర్షాకాలం నేపథ్యంలో వరద నీరు సాఫీగా వెళ్లిపోయేలా పకడ్బందీ చర్యలతో పాటుగా.. ఏ ఒక్క ప్రాణనష్టం జరగకుండా అత్యంత పటిష్టమైన చర్యలను చేపట్టాలని విప్ అరెకపూడి గాంధీ సూచించారు. గత వర్షాకాలంలో నగరంలో జరిగిన ప్రమాదాలు నియోజకవర్గంలో పునరావృతం కాకుండా ఉండేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తత ఎంతో అవసరమన్నారు. వర్షాకాలం తరుణంలో శేరిలింగంపల్లి జోనల్ స్థాయిలోని మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను జోనల్ కమిషనర్ శంకరయ్య, చందానగర్ సర్కిల్ స్థాయి బృందాలను డిప్యూటీ కమిషనర్ నందగిరి సుధాంశ్ సహా కార్పొరేటర్లు రాగం నాగేందర్‌యాదవ్, హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్, జగదీశ్వర్ గౌడ్, మంజులరెడ్డిలతో కలిసి విప్ గాంధీ జోనల్, సర్కిల్ కార్యాలయాల వద్ద బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత అనుభవాల దృష్ట్యా క్షేత్రస్థాయిలో బృందాలు స్వీయ రక్షణతో పాటు ప్రజల ప్రాణాలకు నష్టం కలగని రీతిలో సమర్థంగా పని చేయాలన్నారు. విధులలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా.. కార్మికులకు జైలు, అధికారులకు సస్పెన్షన్, ప్రజాప్రతినిధులకు పనిష్మెంట్ ఇస్తారని గాంధీ స్పష్టం చేశారు. మ్యాన్‌హోళ్లు, నాలాల వద్ద తగు భధ్రత చర్యలను తీసుకోవాలని, ప్రధానంగా మ్యాన్ హోళ్ల మూతలను ఎట్టి పరిస్థితులలో తెరిచి ఉంచొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ శంకర్, ఈఈలు శ్రీకాంతిని, శ్రీనివాస్, డీఈలు స్రవంతి, రమేశ్, సురేశ్, ఏఈలు ప్రశాంత్, ప్రతాప్, సునీల్, వైద్యాధికారి నగేశ్, పార్టీ నేతలు రఘునాథ్‌రెడ్డి, మల్లారెడ్డి, జగన్, శర్మ, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
శిక్షణను సద్వినియోగం చేసుకోండి
నిరుద్యోగులకు రాతపరీక్షలకు ఉచితంగా శిక్షణను అందించేందుకు తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల శిక్షణ కార్యక్రమాన్ని కార్పొరేటర్లు హమీద్‌పటేల్, రాగం నాగేందర్‌యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, జగదీశ్వర్ గౌడ్, మాధవరం రోజాదేవి, మంజులరెడ్డిలతో కలిసి విప్ గాంధీ బుధవారం మియాపూర్ క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రమ శిక్షణ, ఆత్మవిశ్వాసంతో అభ్యసించి ఉద్యోగాన్ని సాధించి కుటుంబానికి రాష్ర్టానికి మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫినాకిల్ విద్యాసంస్థ ప్రతినిధి శ్రీదేవి, సైన్ సంస్థ నిర్వాహకులు విజయ్, మాజీ కార్పొరేటర్ రంగారావు, రఘునాథ్‌రెడ్డి, గౌతం గౌడ్ పాల్గొన్నారు.