సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ) :సర్కారు ఉద్యోగం నిరుద్యోగుల స్వప్నం. అందులో పోలీసు అంటే ఇంకా ప్రత్యేకం. ఖాకీ డ్రెస్ వేసుకొని.. లాఠీ చేతపట్టి విధులు నిర్వర్తించాలన్న యువత కల సాకారానికి పోలీస్‌శాఖ నడుంబిగించింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐదు జోన్లలో ప్రైవేట్‌కు దీటుగా.. ఉచితంగా, పకడ్బందీగా శిక్షణ కొనసాగుతున్నది. నగర కమిషనర్ సీవీ ఆనంద్ మార్గదర్శకత్వంలో పీఆర్టీ సమన్వయకర్త, అడిషనల్ డీసీపీ పరవస్తు మధుకర్‌స్వామి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఐదు జోన్ల నుంచి 5వేల మందికి శిక్షణ కొనసాగుతున్నది.
అవకాశాన్ని చేజారనీయవద్దు.!
పట్టుదలతో శ్రమిస్తే ఉద్యోగం సాధించవచ్చు. నగర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు, నగర పోలీసులకు మంచి పేరు తేవాలి. యువతీయువకులు పోటీ పరీక్షలకు సంసిద్ధులై ఉద్యోగ సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలి. పోలీస్ శాఖ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని సీఎం కేసీఆర్ రెండేళ్లు పొడిగించారు. అందివచ్చిన అవకాశాన్ని చేజారనీయవద్దు. రోజుకు 10 నుంచి 16 గంటలు తప్పకుండా చదువుకోవాలి. ఇంత మంచి అవకాశం మళ్లీ రాకపోవచ్చు.
– సీవీ ఆనంద్, సీపీ, హైదరాబాద్
అభ్యర్థులకు స్టడీ మెటీరియల్
శిక్షణ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించడంతో పాటు పరీక్షల సాధనతో సహా అనుభవం కలిగిన ఫ్యాకల్టీతో బోధిస్తున్నారు. వేసవి దృష్ట్యా శిక్షణ శిబిరాల్లో ఫ్యాన్లు, కూలర్లు, చల్లటి తాగునీరు, ఉచిత భోజనం, తదితర సౌకర్యాలు కల్పించారు. నగర జాయింట్ సీపీ రమేశ్‌రెడ్డితో పాటు కో-ఆర్డినేటర్ పరవస్తు మధుకర్‌స్వామి ని త్యం ఆయా జోన్లలోని శిక్షణ శిబిరాలను సందర్శిస్తున్నారు. శిక్షణలో అభ్యర్థులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ సైతం అందజేశారు. ప్రతి ఆదివారం ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తూ అభ్యర్థుల్లోని ప్రతిభను గుర్తిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం నగర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. వెనకబడిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడం, నైపుణ్యం చూపిన వారు మిగతా వారిని గైడ్ చేసేలా ప్రోత్సహిస్తున్నారు.
సినిమాలు, షికార్లకు దూరంగా ఉండాలి
ఉద్యోగ సాధనే ధ్యేయంగా అభ్యర్థులు ముందుకు సాగాలి. శిక్షణ సమయంలో సెల్ఫోన్లు, చాటింగ్, సినిమాలు, షికార్లకు దూరంగా ఉండాలి. కష్టపడి, ఇష్టపడి చదివితే విజయం తప్పకుండా వరిస్తుంది. ప్రతిఒక్కరూ మ్యాథ్స్ నేర్చుకుని పట్టు సాధించడంతో పాటు, క్లాసులు విని ఇంటికెళ్లిన తర్వాత ఒకటికి రెండు లేదా మూడు సార్లు ప్రాక్టీస్ చేయాలి. అభ్యర్థులు రోజూ ఉదయం 9 గంటల లోపు శిక్షణ కేంద్రాలకు చేరుకోవాలి.
– ఎం.రమేశ్, జాయింట్ సీపీ(అడ్మిన్), హైదరాబాద్
ప్రణాళికాబద్ధంగా శిక్షణ
నగర సీపీ ఆనంద్ మార్గదర్శకత్వంలో నగర కమిషనరేట్ పరిధిలోని కేంద్రాల్లో పీఆర్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నాం. అర్హత పరీక్ష ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులకు కమిషనరేట్‌లోని ఐదు జోన్లలో తరగతులు నిర్వహిస్తున్నాం. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో సబ్జెక్టు బోధన చేస్తున్నాం. ప్రణాళిక బద్ధంగా అభ్యర్థులకు నిరంతరం మెరిట్ పరీక్షలు నిర్వహిస్తూ, వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తున్నాం. ఆయా ప్రాంతాలకు చెందిన ఫ్యాకల్టీతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్తో సహా వ్యాయామ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇస్తుండటంతో అభ్యర్థుల నుంచి విశేష స్పందన వస్తున్నది.
– పరవస్తు మధుకర్‌స్వామి, పీఆర్టీ కో-ఆర్డినేటర్, అడిషనల్ డీసీపీ
శ్రద్ధపెట్టి చదువాలి.!
అభ్యర్థులు ప్రిపరేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి. భయపడకుండా సమయాన్ని బట్టి రాతపరీక్షతోపాటు దేహదారుఢ్య పరీక్షలకు సన్నద్ధమవ్వాలి. ప్రతీ క్షణం ఉద్యోగం సాధిస్తామనే పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తూ అడుగువేయాలి. బలమైన సంకల్పంతో ప్రతీ సబ్జెక్టును శ్రద్ధపెట్టి చదవాలి. రావడంలేదు.. అర్థం కావడంలేదు అనే భావనను దరిచేరనీయవద్దు. చదివిన కొద్ది గంటలైనా శ్రద్ధపెట్టి చదివితే సబ్జెక్టు అర్థమవుతుంది. గుర్తుండి పోతుంది. ప్రధానంగా పర్ఫెక్ట్, నాలెడ్జ్, స్మార్ట్ అనే మూడు టెక్నిక్స్‌తో ప్రణాళిక వేసుకుంటే ఉద్యోగాన్ని సులువుగా కొట్టొచ్చు.
– జోయెల్ డేవిస్, డీసీపీ, వెస్ట్‌జోన్