సిటీబ్యూరో, మే 17(నమస్తే తెలంగాణ): నగరంలో అరుదైన కళా ఖండాలకు కేరాఫ్ అడ్రస్‌గా సాలార్జంగ్ మ్యూజియం కొన్నేండ్లుగా కొనసాగుతున్నది. ఆ మ్యూజియం.. విభిన్న రకాల చారిత్రక వస్తువుల భాండాగారం. నిజాం వస్తువుల నుంచి యూరోపియన్, ఆసియా, దూర ప్రాచ్య దేశాలకు చెందిన కళాత్మక వస్తువుల కేంద్రం. నగలు, నగిషీలతో మిలమిలమెరిసే అరుదైన మ్యూజియం అది. దేశంలో ఉన్న మూడు ప్రత్యేక జాతీయ మ్యూజియాల్లో ఇది ఒకటి. ఇక్కడ దాదాపు 43 వేల చారిత్రక వస్తువులు ఉన్నాయి. చైనా, నేపాల్, ఉత్తర అమెరికా, జపాన్ దేశాల నుంచి సేకరించినవి కూడా ఉన్నాయి. నేడు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా సాలార్జంగ్ మ్యూజియం ఉచిత ప్రవేశంతో పాటు అనేక చారిత్రక సంపదపై సందర్శకులకు అవగాహన కల్పించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి సేకరించిన విలువైన వస్తువుల ప్రాధాన్యతను తిలకించడంతో పాటు ఫొటోలు తీసుకునే అవకాశం కల్పించారు. మ్యూజియం వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 21 వరకు ఉచిత ప్రవేశం ఉంటుంది.
వైల్డ్ రెబెక్కా పాలరాతి విగ్రహం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మనిషి బొమ్మ వచ్చి గంటలు మోగించే మ్యూజికల్ క్లాక్, జహంగీర్ చురకత్తి, నూర్జహాన్ పండ్లు కోసే కత్తి, వివిధ రకాల తుపాకులు, గ్రంథాలు ఉన్నాయి.
ప్రత్యేక ఆకర్శణగా..!!
డబుల్ స్టాచ్యూ.. చూడటానికి ఒకటే శిల్పం.. పరిశీలిస్తే గానీ తెలియదు ఆ శిల్పం వెనక మరో శిల్పం దాగి ఉందని. స్త్రీ పురుష శిల్పంగా పేరుగాంచిన ఈ విగ్రహం అలనాటి కళా నైపుణ్యం ఎలాంటిదో చాటి చెబుతుంది. వెనక వైపు స్త్రీ రూపం కనిపించేలా మిర్రర్ ఏర్పాటు చేశారు. సందర్శకులు ఈ శిల్పాన్ని చూసేందుకు పోటీ పడుతున్నారు. ఈ శిల్పాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎన్నో సందేహాలు.. మరెన్నో కళా హృదయాలకు రసాన్వేషణ.
మోనాలిసా, వేట పూర్తయిన తర్వాత జంతు కళేబారాలతో ఉన్న ఫొటో, గాసిప్స్, ప్రేమికుల ఫొటో, అశ్లీలత లేని న్యూడ్ ఫొటోలను ఆర్ట్ రూపంలో బంధించిన తీరు ఆనాటి ఆసక్తికర విషయాలను కాన్వాస్ రూపంలో భద్రపరిచారు.
పింగాణి వస్తువుల చరిత్రలో సెలడోన్ అనే పాత్ర ప్రత్యేకమైనది. 17వ శతాబ్దంలో ఒక ఫ్రాన్స్ దేశపు నాటక కర్త రాసిన లాస్త్రే అనే నాటకంలో సెలడోన్ పేరుతో ఉన్న గొర్రెల కాపరి పాత్ర బూడిద ఆకుపచ్చ రంగులు కలిసి ఉన్న దుస్తులతో కనిపించేది. ఆ కాలములో సెలడోన్ పాత్రధారి దుస్తుల రంగుతో ఉన్న పింగాణి పాత్రలు చైనా నుంచి ఐరోపా దేశాలకు విరివిగా దిగుమతి కావడం వలన సెలడోన్ అనే పేరు సందర్భోచితంగా ఆ పాత్రలకు పెట్టబడిందని సిబ్బంది తెలిపారు. కాగా, ఈ పాత్రలో విష ఆహారం వడ్డిస్తే వెంటనే ఆ ఆహారం రంగు మారడం.. విష పరిధి అధికంగా ఉంటే పాత్ర విరగడం జరిగేల తయారు చేశారు. ఈ పాత్రను నిజాం ఎంతో ఇష్టంతో ఇక్కడికి తెప్పించుకున్నారని సమాచారం.
300లకు పైగా గడియారాలు ఉన్నాయి. 18, 19, 20వ శతాబ్దాలకు చెందిన అనేక ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ, ఇటలీ, అమెరికా, స్విట్జర్లాండ్ మ్యూజియపు గడియారాలు అతి చిన్న సైజులో భూతద్దలో నుంచి చూస్తే గానీ కనపడని గడియారాలు ఇక్కడ అనేకం ఉండటం విశేషం. బరువైన ఫ్రెంచి గడియారాలు అనేకం ఉన్నాయి. తాబేలు, శరీరం, లోహపు తొడుగులు అమర్చిన గడియారాలు ఉన్నాయి. మహిళ రూపంలో ఉన్న ఓ గడియారం ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది. 20వ శతాబ్దానికి చెందిన ఈ గడియారం స్విట్జర్లాండ్ నుంచి నిజాం తీసుకొచ్చారు. యోగా ప్రాధాన్యతను చాటేలా ఈ గడియారాన్ని రూపొందించారు.
ఏనుగు దంతాలతో అరుదైన కళా ఖండాలు కొలువుదీరాయి. డైమండ్స్‌తో రూపొందించిన ఖడ్గాలు ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. పాలరాతి శిల్పాలు, బొమ్మలు, వస్ర్తాలు, చేతి వ్రాతలు, సెరామిక్స్, లోహ కళా ఖండాలు, తివాచీలు, చెస్ బోర్డులు, నాణేలు ఇలా అనేకం ఉన్నాయి.