వ్యవసాయ యూనివర్సిటీ, మే 17: పెరుగుతున్న జనాభాకుతోడు మనిషి అవసరాలకంటే అదనంగా సహజ వనరులను ధ్వంసం చేయడం వల్ల ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. దేశంలో భూకంపాలు రాకుండా ముందుజాగ్రత్తగా వాటిని ఎదుర్కొనడానికి శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేయాలని సూచించారు. మంగళవారం రాజేంద్రనగర్‌లోని ఎన్ఐఆర్డీలో రీజినల్ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రొగ్రామ్‌లో భాగంగా తొలిరోజు కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించి మాట్లాడారు. పెరుగుతున్న పట్టణీకరణ, ప్రకృతి విధ్వంసం వల్ల తుపాన్లు, వరదలు, ఉష్ణోగ్రతల పెరుగుదల, భూకంపాలు, అకాల వర్షాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వేసవి, వర్షాకాలం, చలికాలం సమానంగా ఉండేవని, ఇప్పుడేం జరుగుతుందో చెప్పలేని గందరగోళ పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్ఐఆర్డీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రీసెర్చ్ డైరెక్టర్ డా.నరేంద్రకుమార్, డైరెక్టర్ జనరల్ శశిభూషణ్, సంతోష్‌కుమార్, ప్రీతిసోని తదితరులు పాల్గొని మాట్లాడారు. కర్ణాటక, తమిళనాడు, హర్యానా, తెలుగురాష్ర్టాలతోపాటు వివిధ రాష్ర్టాలకు చెందిన శాస్త్రవేత్తలు హాజరయ్యారు.