మియాపూర్, మే 17 : ప్రజల సౌకర్యం కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ నిరంతర అభివృద్ధి పనులతో ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమ పనులతో నియోజకవర్గాన్ని అగ్రభాగంలో నిలపటమే తన లక్ష్యమన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబరోటరీ, కృషినగర్, హెచ్ఎంటీ స్వర్ణపురి, మయూరీనగర్, న్యూ కాలనీల్లో రూ.2,02,20,000 నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులతో పాటు ఓపెన్ జిమ్‌లకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి విప్ అరెకపూడి గాంధీ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల తోడ్పాటుతో అత్యధిక నిధులతో ప్రజలకు తాగునీరు, డ్రైనేజీ, సౌకర్యవంతమైన రహదారులు, కమ్యూనిటీహాళ్లు, సహా ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనులతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ నేతలు, మహిళా నేతలు, ఆయా కాలనీల ప్రతినిధులు, వార్డు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
డివిజన్ అభివృద్ధికి రూ.3.91 కోట్ల నిధులు..
కొండాపూర్, మే 17 : శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుగులు తీస్తున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన చందానగర్ డివిజన్ అభివృద్ధికి మంజూరైన రూ. 3.91కోట్ల నిధులతో డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు, ఆర్సీసీ పైపులైన్ల నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నదని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలతో పాటు ఇతర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.