రంగారెడ్డి, మే 16, (నమస్తే తెలంగాణ) : ఇప్పటివరకు సామాన్యులనే టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా కలెక్టర్ పేరిట నకిలీ ఖాతాను తెరిచారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఫొటోతో నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించిన సైబర్ కేటుగాళ్లు పలువురిని డబ్బులు డిమాండ్ చేశారు. అయితే జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియతోపాటు కొండాపూర్‌లోని జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ ఝాన్సీకి 9054526206 వాట్సాప్ నంబర్ ద్వారా డబ్బులు కావాలని మెసేజ్‌లు వచ్చాయి. అయితే రెండు నిమిషాల క్రితమే కలెక్టర్ అమయ్‌కుమార్‌తో మాట్లాడిన డీఆర్వో హరిప్రియ వెంటనే తన వాట్సాప్‌నకు వచ్చిన మెసేజ్‌లకు సంబంధించి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన కలెక్టర్ సైబర్ నేరగాళ్ల పనేనని గుర్తించి ఎవరూ స్పందించవద్దని జిల్లా అధికారులందరికీ సమాచారం అందించారు. అదేవిధంగా అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం సైబర్ క్రైమ్స్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తన ఫొటోతో నకిలీ వాట్సాప్ ఖాతాతో ఎవరైనా డబ్బులు అడిగితే ఎవరూ స్పందించవద్దని, వెంటనే సమాచారమివ్వాలని సూచించారు.