సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ) : పాలసీదారు మృతిచెందినా బీమా చెల్లించరా అంటూ భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి వినియోగదారుల ఫోరం-1 మొట్టికాయలు వేసింది. 45 రోజుల్లోగా రూ.5.8లక్షల బీమాతో పాటు రూ.50వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌లోని గౌరీశంకర్‌నగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి టి.నూకరాజు తన భార్య పేరుతో భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 2017లో జీవిత బీమా పాలసీని తీసుకున్నాడు. కాగా 2020లో పాలసీదారు అనారోగ్యంతో మృతిచెందింది.
బాధితుడు పాలసీ బీమా డబ్బులు చెల్లించాలని తన భార్య మరణ ధ్రువీకరణ పత్రాన్ని జతచేస్తూ.. కంపెనీకి అర్జీ పెట్టుకున్నాడు. అయితే పాలసీ నిలిపివేశామని కంపెనీ ప్రతినిధులు బదులిచ్చారు. పాలసీ నిలిపివేస్తే ప్రీమియం చెల్లింపు డబ్బులు ఎలా తీసుకుంటారని బాధితుడు హైదరాబాద్ వినియోగదారుల ఫోరం-1ను సంప్రదించాడు. విచారించిన ఫోరం-1 సభ్యురాలు సి.లక్ష్మీప్రసన్న బీమా డబ్బులు రూ.5,87,303 మొత్తాన్ని ఆమె మరణించిన తేదీ నుంచి 24శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించారు. అలాగే నష్టపరిహారం కింద రూ.50వేలు, మరో రూ.10వేలు ఖర్చుల కోసం చెల్లించాలని ఆదేశించారు.