మేడ్చల్, మే 10 (నమస్తే తెలంగాణ): ప్రకృతి వనాలతో పల్లెల రూపురేఖలు మారుతున్నాయి. పచ్చందాలతో పల్లెలన్నీ ఆహ్లాదకరంగా మారుతున్నాయి. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 61 గ్రామ పంచాయతీలలో 81 పల్లె ప్రకృతి వనాలను పెంచుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ద్వారా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఏడు విడతలుగా నిర్వహించిన హరితహారం ద్వారా పల్లె ప్రకృతి వనాలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
మండలానికి 4 చొప్పున పల్లె ప్రకృతి వనాలు..
జిల్లాలోని బృహత్ పల్లె ప్రకృతి వనాలను మండలానికి నాలుగు చొప్పున ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ హరీశ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో 6 ఎకరాల నుంచి 10 ఎకరాల విస్తీర్ణం ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. 8వ హరితహారం ప్రారంభమయ్యే నాటికి స్థలాలను గుర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఘట్కేసర్ మండలం కాచవాని సింగారం, కీసర మండలం చీర్యాల్, మేడ్చల్ మండలం శ్రీరంగవరం, మూడుచింతలపల్లి జగ్గన్గూడ, శామీర్పేట్ మండలం బొమ్మరాసిపేటలో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. మరో 12 బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు త్వరలోనే స్థలాలను గుర్తించనున్నట్లు అధికారులు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 63 లక్షల మొక్కలు..
8వ విడత హరితహారంలో జిల్లా వ్యాప్తంగా 63 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని ఎంచుకున్నారు. 61 గ్రామ పంచాయతీలు, 13 మున్సిపాలిటీలలో 63 లక్షల మొక్కలను నాటేందుకు అటవీశాఖ ఆధ్యర్వంలో ప్రణాళికను సిద్ధం చేశారు. మేడ్చల్, శామీర్పేట్, మూడుచింతలపల్లి, ఘట్కేసర్, కీసర మండలాల్లో 11 లక్షల మొక్కలను నాటనున్నారు. బోడుప్పల్, దమ్మాయిగూడ, దుండిగల్, ఘట్కేసర్, గుండ్ల పోచంపల్లి, జవహర్నగర్, కొంపల్లి, మేడ్చల్, నాగారం, నిజాంపేట్, పీర్జాదిగూడ, పోచారం, తూంకుంట మున్సిపాలిటీలలో 52 లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఇప్పటికే పల్లె, పట్టణ ప్రకృతి వనాల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కలు నాటడంతో పాటు జాతీయ రహదారులకు ఇరువైపులా ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో 8వ విడత హరితహారంలో మొక్కలు నాటనున్నారు. నాటిన మొక్కలను పరిరక్షించే బాధ్యత అధికారులదేనని జిల్లా కలెక్టర్ సూచించారు.