అబిడ్స్, మే 10: 34 కేసులతో సంబంధం ఉండి 33 సంవత్సరాల నేర చరిత్ర కలిగిన రౌడీ షీటర్‌ను మంగళ్‌హాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోషామహల్ ఏసీపీ కార్యాలయంలో మంగళ్‌హాట్ ఇన్స్పెక్టర్ ఎన్ రవితో కలిసి ఏసీపీ ఆర్ సతీశ్‌కుమార్ విలేకర్లకు వివరాలను వెల్లడించారు. ఆర్కే పేట్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ మహ్మద్ చాంద్ అలియాస్ బిల్డర్ చాంద్ (56) 1988 సంవత్సరం నుంచి నేరాలకు పాల్పడుతున్నాడు. కిషన్‌నగర్ జిర్రా ప్రాంతంలో ఉండే ఆయనపై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 34 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు 2015 సంవత్సరంలో పీడీ యాక్ట్ నమోదు చేశారు. 2019 సంవత్సరంలో మారణాయుధాల చట్టం కేసులో అరెస్టయ్యాడు.
వ్యాపారులు, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసే మహ్మద్ చాంద్ ఇటీవల గంజాయి విక్రయాలు ప్రారంభించాడు. విశాఖపట్నం అరకులో గంజాయిని కొనుగోలు చేసి, మంగళ్‌హాట్ అల్లబండ కొండలలో భద్రపరిచేవాడు. ఇటీవల అల్లబండ కొండలలో నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయించేందుకు ఆర్కె పేట్లో ఆటో కోసం వేచి ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 20.02 కిలోల గంజాయి, డాగర్ కత్తి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రౌడీషీటర్ మహ్మద్ చాంద్‌ను అరెస్ట్‌పై మంగళ్‌హాట్ పోలీసులను పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్, అదనపు డీసీపీ ఎం ఇక్బాల్ సిద్దిఖి, గోషామహల్ ఏసీపీ ఆర్ సతీశ్‌కుమార్ అభినందించారు.