మేడ్చల్, మే 10(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ కేంద్రాలను సైతం ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ప్రభుత్వం అందించే ఉచిత శిక్షణను ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. చక్కటి అవకాశాలను కల్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర సర్కారుకు రుణపడి ఉంటామని, గతంలో ఏ ప్రభుత్వాలు ఇలాంటి చర్యలను చేపట్టలేదని ఉద్యోగార్థులు వేనోళ్ల ప్రభుత్వ సేవలను కొనియాడుతున్నారు. అయితే, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 400 మంది నిరుద్యోగ యువతను పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు శిక్షణ ఇస్తున్నది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ, మైనార్టీలకు తర్ఫీదును ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
గ్రూప్-1 నుంచి గ్రూప్-4 ఉద్యోగాలకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులందరికి శిక్షణను 60 రోజుల పాటు ఇచ్చేందుకు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఎస్సీ అభ్యర్థులకు కోచింగ్ కేంద్రాన్ని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌లోని అంబేద్కర్ భవనం, ఎస్టీ అభ్యర్థులకు సురారంలోని జగ్జీవన్‌రామ్ భవనంలో ఏర్పాటు చేశారు. ఎస్సీలకు సంబంధించి 77 మంది, ఎస్టీలకు సంబంధించిన నిరుద్యోగ యువత 26 మంది ప్రస్తుతానికి కోచింగ్ అందిస్తున్నారు. బీసీ, మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఇటీవల శిక్షణను ప్రారంభించారు.
శిక్షణతో ప్రతి అభ్యర్థికి రూ.1500 విలువైన పుస్తకాలు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు రూ.1500 విలువ గల పుస్తకాలను అందిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోచింగ్ కేంద్రాన్ని నిర్వహించి వారికి భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. శిక్షణ పొందుతున్న ప్రతి అభ్యర్థికి రూ. ప్రతిరోజు రూ.75లను అందిస్తున్నారు.
నిరుద్యోగ అభ్యర్థులకు విలువైన సమయమిది..
నిరుద్యోగులైన అభ్యర్థులకు విలువైన సమయం ఇది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నిరుద్యోగ అభ్యర్థులు ప్రస్తుతం ఉచితంగా శిక్షణ పొందుతున్నారు. 60 రోజుల పాటు కొనసాగనున్న ఈ శిక్షణలో రూ.1500 విలువైన పుస్తకాలను ఉచితంగా అందించి, భోజన సౌకర్యం కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా ప్రతిరోజు ప్రతి అభ్యర్థికి రూ.75 ఇస్తున్నాం. నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం కావాలి.
– వినోద్ కుమార్, షెడ్యూలు కూలాల సంక్షేమ అధికారి, మేడ్చల్ జిల్లా
ఏ ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు
ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి తీసుకున్న నిర్ణయంతో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నాం. ఉద్యోగాలు సాధించేందుకు పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు ఉచితంగా కోచింగ్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం హర్షనీయం. ఇలాంటి నిర్ణయాలు ఏ ప్రభుత్వాలు తీసుకోలేదు. నిరుపేదల నిరుద్యోగ అభ్యర్థులకు కోచింగ్ కేంద్రాలు ఎంతోగానో ఉపయోగపడనున్నాయి.
– శ్రీలక్ష్మి, నిరుద్యోగ యువతి
ప్రభుత్వానికి రుణపడి ఉంటం..
ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుని, నిరుద్యోగ అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు ఉచిత కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. ఉచిత కోచింగ్‌తో పాటు చదువుకునేందుకు విలువైన పుస్తకాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం.
– శ్రావణి, నిరుద్యోగ యువతి;
నిరుద్యోగులకు ప్రభుత్వం అందిస్తున్న సదవకాశం
ప్రభుత్వం ఉచిత కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, నిరుపేద నిరుద్యోగ అభ్యర్థులకు మంచి అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఫలితాలు సాధించేందుకు పట్టుదలతో చదుతున్నాం.. చదువుతాం. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై యువతి సంతోషంగా ఉంది.
– స్వర్ణలత, ఉద్యోగార్థి