శామీర్‌పేట, మే 10 : స్వయంగా మంత్రి హామీ ఇచ్చి నిధులు మంజూరు చేయించినా.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. అసంపూర్తి పనులతో ప్రజలు, ప్రయాణికులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ తంతు ఎక్కడో కాదు శామీర్‌పేట మండలం అలియాబాద్ గ్రామ పంచాయతీ సాక్షిగా జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే … ప్రజా సంక్షేమమే థ్యేయం ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో రా్రష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కంటికి నిద్ర లేకుండా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు చేస్తూ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు.
ఈ తరుణంలో అలియాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సుమారు రూ.10లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. సర్పంచ్ ఆధ్వర్యంలో పనులను కాంట్రాక్టర్ ప్రారంభించారు. ఏండ్లనాటి సమస్య పరిష్కారం అవుతుందని ప్రజలు, ప్రయాణికులు, విద్యార్థులు సంతోషించేలోపే కాంట్రాక్టర్ కనిపించకుండా పోయాడు. సీసీ రోడ్డు పనులను పట్టించుకోకపోగా.. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను అసంపూర్తిగా వదిలేశాడు.
పనులు ప్రారంభించి సుమారు 2 నెలలు గడుస్తున్నా పనులను పట్టించుకున్న నాథుడేలేడు. గత వారం, పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ పైపుల్లో బురుద, మట్టి నిండిపోయింది. ప్రజలు, విద్యార్థులు అసంపూర్తిగా తవ్వి వదిలేసిన గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందిం చి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయించాలని కోరుతున్నారు.