తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు గజ్జెల నాగేష్, క్రిషాంక్లు హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక నిర్ణయంగా వారు అభివర్ణించారు. అంబేద్కర్ పట్ల ఉన్న గౌరవాన్ని సీఎం కేసీఆర్ మరోసారి సగర్వంగా చాటుకున్నారని కొనియాడారు. పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరును పెట్టి బీజేపీ ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని వారు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని అంబేద్కర్ పొందుపర్చడం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు సాగుతున్న తెలంగాణ పరిపాలనా సముదాయమైన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం తెలంగాణకే గర్వకారణమన్నారు.
సికింద్రాబాద్,ఉస్మానియా వర్సిటీ సెప్టెంబర్ 15
దళిత, వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం పోరాడిన మహనీయుడి పేరును సచివాలయానికి పెట్టడంతో దేశానికి సీఎం కేసీఆర్‌గా స్ఫూర్తిగా నిలిచారని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి కొనియాడారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో దళిత, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనానికి బాబా సాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని డిమాండ్ చేశారు. – జక్కుల మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్ బోర్డు
ఆత్మ గౌరవానికి ప్రతీక భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్. అంబేద్కర్ అని టీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ అన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం మనందరికీ గర్వకారణమన్నారు. అంబేద్కర్ భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులతో ప్రతి ఒక్కరూ తల ఎత్తుకొని ధైర్యంగా, ఆత్మగౌరవంతో జీవిస్తున్నామన్నారు. అలాంటి మహానుభావుని పేరుని తెలంగాణ సచివాలయానికి పెట్టడం సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమన్నారు.
– ముప్పిడి మధుకర్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కంటోన్మెంట్