సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తేతెలంగాణ): వినాయకుడి మహా నిమజ్జనానికి ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 35 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్షల సంఖ్యలో సీసీ కెమెరాలతోపాటు మౌంటెడ్ కెమెరాలతో నిఘా ఉంచారు. దీనికి తోడు డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు. నిమజ్జనానికి నగర నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా హుస్సేన్‌సాగర్‌కు విగ్రహాలు తరలివస్తుంటాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న ప్రధాన చెరువులు, తాత్కాలిక కొలన్ల వద్ద విగ్రహాలతో వెళ్లే వాహనాలు సాఫీగా సాగేలా ఏర్పాట్లు పూర్తి చేశారు.
అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేశ్ భగవత్‌లు సమావేశాలు ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి తరలించే రూట్లపై మండపాల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. నిమజ్జనం శుక్రవారం కావడంతో అన్నివర్గాలను పరిగణనలోకి తీసుకొని ప్రశాంత వాతావరణంలో కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు మూతబడ్డాయి.