కేపీహెచ్బీ కాలనీ, జూలై 29 : వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టినిసారించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వలు, చెరువులు కుంటలలో నీరు చేరడంతో అపరిశుభ్ర పరిసరాలను కేంద్రంగా చేసుకుని దోమలు ఈగలు వృద్ధి చెందుతున్నాయి.
దోమలు ప్రజలపై దండయాత్ర చేస్తుండడంతో డెంగీ, మలేరియా లాంటి విష జ్వరాలబారిన పడుతున్నారు. ఇటీవల జోన్ పరిధిలో డెంగీ కేసులు పెరుగుతుండడంతో దోమలను లార్వా దశలోనే నియంత్రించే దిశగా జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ప్రత్యేక దృష్టినిసారించింది. దోమల వృద్ధికి కారణమైన అపరిశుభ్ర పరిసరాలను శుద్ధి చేసేందుకు కార్యచరణను సిద్ధం చేసింది.
ఈ డ్రైవ్లో ప్రజలను భాగస్తులను చేస్తూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా మార్చుకునే దిశగా కార్యచరణను చేపట్టింది. రేపటినుంచి ప్రతీ ఆదివారం పది నిమిషాలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా మార్చుకునేందుకు నడుం బిగించాలని దోమల నియంత్రణకు బాధ్యతగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు.
చెరువులు, కుంటలలో మురుగు నీటిని ఆసరాగా చేసుకుని దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఈ దోమలను లార్వా దశలోనే నియంత్రించేందుకు రసాయనాలను పిచికారి చేయడం, పెరిగిన దోమలను నియంత్రించేందుకు ఫాగింగ్ చర్యలు చేపడుతున్నారు. ప్రతీ ఆదివారం పది నిమిషాల పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా చేసుకోవాలని దోమలను లార్వా దశలోనే నియంత్రించేందుకు సహకరించాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు.
కూకట్పల్లి జోన్లోని ఐదు సర్కిళ్లలో ఇటీవల కాలంలో 40 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇంటి పరిసరాల్లో పెరిగిన ఎడిస్ మస్కిటో (ఎడిస్ దోమ) కుట్టడం వల్ల డెంగీ జ్వరాలు వస్తాయి. డెంగీ కేసు నమోదైన ఇంట్లో నీటి నిల్వలను తొలగించడం, దోమలను నియంత్రించేలా రసాయనాలను పిచికారి చేస్తున్నారు. ఆ కాలనీలో ఇంటింటి తిరిగి సర్వే చేస్తూ దోమల ఆవాసాలను తొలగించే పనులను ముమ్మరం చేశారు. లార్వా దశలోనే దోమలను నియంత్రించేలా అవగాహన కల్పించడం, పెరిత్రిమ్ రసాయనాల పిచికారీ, ఫాగింగ్ చర్యలు చేస్తున్నారు.
దోమల నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలి. ఆదివారం పది నిమిషాలు కేటాయించి ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. డెంగీ లాంటి సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. చెరువులలో గుర్రపు డెక్కను తొలగించడం, నీటి నిల్వలపై రసాయనాలను పిచికారి చేయడం, కాలనీలు బస్తీలలో క్రమం తప్పకుండా ఫాగింగ్ చర్యలు చేస్తున్నాం. డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. పది ఆదివారాలు ప్రజలందరూ పది నిమిషాలు కేటాయించి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా మార్చుకోవాలని కోరుతున్నాం.
– వి.మమత, జడ్సీ, కూకట్పల్లి