కిస్మత్‌పురాలో 5.47 ఎకరాల్లో మూడు టవర్లతో ప్రాజెక్టు నిర్మాణం
సిటీబ్యూరో, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): థీమ్ ఆధారిత ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రముఖంగా పేరొందిన గిరిధారి హోమ్స్ తాజాగా టీఎస్పీఏ జంక్షన్ సమీపంలోని కిస్మత్‌పురాలో ‘హ్యాపీనెస్ హబ్’ పేరిట నూతన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 5.47 ఎకరాల్లో జీ+5 అంతస్తులో మూడు టవర్లను నిర్మిస్తున్నట్లు సంస్థ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
వినియోగదారులకు అందుబాటు ధరలో ఆరోగ్యకరమైన కమ్యూనిటీలను నిర్మించి ఫైవ్‌స్టార్ తరహాలో సదుపాయాల్ని కల్పించి సరికొత్త సంతోషాన్ని అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని గిరిధారి సంస్థ ఎండీ ఇంద్రాసేనారెడ్డి తెలిపారు. విదేశాల్లో ప్రాచుర్యం పొందిన హ్యాపీనెస్ కాన్సెప్టును అందిపుచ్చుకుని చిన్నారులు, ఆధునిక యువతీ యువకులతో పాటు పెద్దలూ నిత్య సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో హ్యాపీనెస్ హబ్‌కు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
570 ఫ్లాట్లు, 1033 నుంచి 1601 చదరపు అడుగుల్లో విస్తీర్ణం ఉంటుందని, 2025 డిసెంబరులోపు ఈ ప్రాజెక్టు పూర్తి చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఫ్లాట్ ధర అదనపు అడుగు రూ.5,500లుగా నిర్ణయించినట్లు ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ.155 కోట్లు అని, రానున్న ఏడాదిలోపు సుమారు మూడు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాల్ని ప్రారంభిస్తామని చెప్పారు. వీటి విలువ రూ.1500 కోట్ల దాకా ఉంటుందని చెప్పారు.