సిటీబ్యూరో, నవంబర్ 16(నమస్తే తెలంగాణ): సినిమాల పైరసీతో నిర్మాతలకు కోట్ల రూపాయల్లో నష్టం చేస్తున్న ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు క్లోజ్ చేయించారు. వెబ్ లాగిన్లను, సర్వర్ వివరాలతో మూసివేశారు. నిందితుడు ఇమ్మడి రవితోనే ఆ వెబ్సైట్లను క్లోజ్ చేయించి దమ్ముంటే నన్ను ప ట్టుకోండంటూ సవాల్ విసిరిన వ్యక్తితోనే ఆ సవాల్‌ను ఎదు ర్కొన్నారని పోలీసుల్లో చర్చ జరుగుతుంది. ఐబొమ్మ నిర్వాహకుడు రవి వద్ద స్వాధీనం చేసుకున్న వందల హార్డ్ డిస్క్‌లను, బ్యాంక్ ఖాతాల వివరాలను పరిశీలిస్తున్నారు. రవిని కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరించాలని కోర్టులో ఏడురోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఏడు కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఫిలిం చాంబర్ పైరసీ సెల్ విభాగంతో పాటు సినీ నిర్మాతల ఫిర్యాదులతో ఈ కేసులు నమోదయ్యాయి. సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేసుకుని రవి బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి.. పైరసీ రంగంలోకి..
ఐబొమ్మ రవి అరెస్ట్‌తో కీలకవిషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఇమ్మడి రవి తక్కువ సమయంలో డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పైరసీ రంగంలోకి దిగినట్లు తెలిపారు. ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ చదివిన రవి పైరసీ రంగంలో కింగ్‌పిన్‌గా మారారన్నారు. సినిమా పైరసీకి సంబంధించి సుమారుగా వెయ్యి మంది హ్యాకర్లతో పెద్ద ఎత్తున పైరసీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కొత్త సినిమాలు పైరసీ చేశారు. అయితే వీరంతా హై సెక్యూరిటీ ఉన్న సర్వర్లను సైతం హ్యాక్ చేస్తున్నారని, సినిమా నాణ్యతను బట్టి వంద నుంచి ఐదువందల డాలర్ల వరకు కమీషన్ సంపాదిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఐబొమ్మ మూసివేసినా మరో 65 ప్రాక్సి సైట్లను ముందస్తు జాగ్రత్తగా రెడీ చేసిన రవి మరో వంద సైట్లను తన సన్నిహితుల ద్వారా మేనేజ్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
పైరసీ సినిమాలను అప్లోడ్ చేసే నిర్వాహకులు వాటి ఐపీ అడ్రస్‌లను ఎప్పటికప్పుడు మార్చుతూ ఒకరోజు ఢిల్లీ, మరోరోజు నెదర్లాండ్స్.. ఇలా నెలకు ఐపీ అడ్రస్‌లను మార్చిన సందర్భాలున్నాయని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. సర్వర్లను హ్యాక్ చేసి హెచ్డీ క్వాలిటీ ప్రింట్స్ సేకరించేందుకు హ్యాకర్లకు పెద్ద ఎత్తున ఆఫర్లు ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. చైనా, దుబాయ్, సింగపూర్, మలేసియా, నెదర్లాండ్స్ తదితర దేశాల నుంచి ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లు ఆపరేట్ చేస్తున్న కంపెనీలకు చెందిన వారు ప్రధాన నిందితులుగా ఉండగా ఈ గేమింగ్ యాప్‌లలో నష్టపోయిన వారిని ఎంపిక చేసుకుని సోషల్ మీడియా ద్వారా పైరసీకి సహకరించేవారిని గుర్తించే బాధ్యతను అప్పగించి పోలీసులకు దొరకకుండా ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.