Sajjanar | జూబ్లీహిల్స్‌లో విశ్రాంత ఐపీఎస్ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసుకు సంబంధించిన కీలక వివరాలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. తెల్లవారుజామున రెండు గంటలకు దుండగులు తనూజను హత్య చేసినట్లు తమకు ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. నేపాలీ గ్యాంగ్ ఈ హత్య చేశారని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చామని పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్ని క్లూస్ లభించాయని.. వాటి ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
ఈ కేసులో రిటైర్డ్ డీజీ ఇంట్లో ఎవరూ లేనప్పుడు పనిమనిషి కల్పన అనే నేపాలీ మహిళ మరికొందరితో కలిసి హత్య చేసిందని సీపీ సజ్జనార్ తెలిపారు. నిందితురాలు ఏడాదిగా అదే ఇంట్లో పనిచేస్తుందని పేర్కొన్నారు. బయటి నుంచి వచ్చిన వారు కల్పన సహాయంతో ఈ హత్య చేశారని చెప్పారు. నిందితులు వెనుక గేటు నుంచి ఇంట్లోకి ప్రవేశించారని తెలిపారు. ఘటన సమయంలో పిల్లలు ఇద్దరూ పై ఫ్లోర్లో పడుకున్నారని.. తనూజ గ్రౌండ్‌ఫ్లోర్‌లో పడుకున్నారని వెల్లడించారు. చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి, ఊపిరాడకుండా ఆమెను చంపేశారని తెలిపారు. ఈ కేసులో ఎంత బంగారం, నగదు పోయిందనే అంశాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
నేపాల్ పని మనుషులతో జాగ్రత్త
మేము వద్దని చెప్తున్నా ఇంకా వాళ్ళనే పనిలో కొనసాగిస్తున్నారు
హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య తనూజా రంజన్ హత్య కేసుకు సంబంధించిన విషయాలు తెలిపిన సీపీ సజ్జనార్
చేతులు కట్టేసి నోట్లో గుడ్డ కుక్కి చంపేశారు
ఇది నేపాలీ గ్యాంగ్ పనే.. సంవత్సరం క్రితం… https://t.co/B4Ny1u89Ih pic.twitter.com/zqQlB0yEZH
— Telugu Scribe (@TeluguScribe) May 8, 2026
నేపాలీ పని మనుషులతో జాగ్రత్తగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నేరాలకు పాల్పడుతుంటారని తెలిపారు. వాళ్లు ఏడాది, రెండేళ్లుగా పనిచేస్తున్నప్పటికీ వాళ్లపై పక్కా నిఘా ఉంచాలని సూచించారు. బెంగళూరు ముంబై, పుణేలో ఈ నేపాలీ ముఠాలు నేరాలకు పాల్పడుతుంటారని చెప్పారు. నిందితులను పట్టుకోవడానికి అన్నివిధాల ప్రయత్నిస్తున్నామని తెలిపారు.