SPR Hills | జూబ్లీహిల్స్, ఏప్రిల్ 16 : జూబ్లీహిల్స్ నియోజక వర్గం రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్‌లోని జీహెచ్ఎంసీ మైదానంపై కబ్జాదారుల కన్నుపడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించారు. మైదానాన్ని ప్రజోపయోగంగా తీర్చిదిద్ది స్థానిక ప్రజలకు అందించడంతో పాటు స్థానికులకే తమ సామూహిక ఆస్తిని కాపాడుకునే బాధ్యత అప్పగించనన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి ఇక్కడ పర్యటించారు.
ప్రస్తుతం 6 ఎకరాలకుపైగా ఉన్న ఈ స్థలంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు భారీ స్పోర్ట్స్ స్టేడియం కానీ, అందరికీ ఆరోగ్యాన్ని అందించే ఆహ్లాదకరమైన పార్కును కానీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లు వంటి సామూహిక గృహ నిర్మాణ పథకానికి ఈ స్థలాన్ని వినియోగించవచ్చా అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఒకప్పుడు రాతి గుట్టగా ఉన్న ఈ స్థలంలో క్రమంగా రాళ్లు తొలగించి పెద్దా లోయగా మారినప్పటికీ ఇది క్వారీ ల్యాండ్ గానే ప్రసిద్ది పొందింది.
అప్పట్లో సుమారు 10 నుంచి 15 ఎకరాలకుపైగా వున్న ఈ స్థలం తరచూ దురాక్రమణలకు గురవుతుండడంతో మిగిలిన 9 ఎకరాలకుపైగా స్థలాన్ని రెవెన్యూ నుంచి బల్దియాకు బదలాయించారు. కాగా ఈ స్థలంలో నే మరో వైపు జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాల్ నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఇంకా 8 ఎకరాలకు పైగా స్థలం అక్కడ మిగిలి వుండాలి. అయితే ఇప్పటికే అధికారులు ఇక్కడ కాంపౌండ్ వాల్ నిర్మించినప్పటికీ చుట్టుముట్టు ఉన్న బస్తీలను ఎరగా చేసుకుంటున్న కబ్జాదారులతో ఈ స్థలానికి ప్రమాదం పొంచి వుంది. ఈ స్థలానికి చుట్టూ బ్రహ్మ శంకర్ నగర్, ఎన్ఎస్బి నగర్, వినాయక్ నగర్, హబీబ్ ఫాతిమా నగర్ ఫేస్_2, సలీం బాబా నగర్, సంజయ్ నగర్ లు విస్తరించి వున్నాయి. సింహ భాగం 127 సర్వే నెంబర్లో వున్న ఈ స్థలం ప్రస్తుతం సుమారు 6 ఎకరాలు మాత్రమే మిగిలి వుండవచ్చని అధికారుల అంచనా.
అయితే ఈ స్థలాన్ని ఇలాగే వదిలేస్తే దురాక్రమణల పర్వం కొనసాగుతూనే ఉంటుందని భావించిన జిల్లా కలెక్టర్ దీనిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఈ స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇందులో భాగంగా మొదట ఇక్కడ ఈ స్థలానికి జీహెచ్ఎంసీ అధికారులు పకడ్బందీగా కాంపౌండ్ వాల్ నిర్మించనున్నారు. అయితే ఏ పండుగ వచ్చినా.. ఏ కార్యక్రమం జరిగినా అందరి సామూహిక అవసరాలకు ఉపయోగ పడుతున్న ఈ స్థలాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో వేచి చూడాల్సిందే.