హైదరాబాద్: హైదరాబాద్‌లోని కుషాయిగూడలో దారుణం చోటుచేసుకున్నది. అనుమానంతో ఓ నిండు చూలాలని (Pregnant Woman) కూడా చూడకుండా భార్య కడుపుపై కూర్చుని హింసించాడో భర్త. దీంతో గర్భంలో నుంచి బయటకు వచ్చిన శిశువు మృత్యువాత పడింది. ఈ నెల 18న ఈ అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
కాచిగూడకు చెందిన అతిపాముల సచిన్ సత్యనారాయణ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు. అతనికి కాప్రాకు చెందిన స్నేహతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. అనంతరం అది ప్రేమగా మారడంతో 2022లో వివాహం చేసుకున్నారు. ఏడాది తర్వాత వారికి ఓ బాబు జన్మించాడు. అప్పటిదాకా సజావుగా సాగిన కుటుంబం.. అనంతరం చిక్కుల్లో పడింది. డెలివరీ బాయ్ పని మానేసిన సచిన్.. జులాయిగా తిరగడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో అందులో నుంచి బయటపడానికి తన బిడ్డను పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తికి రూ.లక్షకు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
విషయాన్ని తెలుసుకున్న స్నేహ కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో బిడ్డను రక్షించిన పోలీసులు తిరిగి వారికి అప్పగించారు. అయితే కొద్ది కాలానికి అనారోగ్యంతో ఆ బాబు మృతిచెందాడు. అనంతరం ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో కొన్నినెలలు దూరంగా ఉన్నారు. కాగా, గతేడాది డిసెంబర్ 11న మళ్లీ కలిసిన ఇద్దరు.. కాప్రాలో ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. అయితే, భార్య 7 నెలల గర్భంతో ఉన్నట్లు తెలుసుకున్న సచిన్ గర్భం ఎలా వచ్చిందంటూ ఆమెను వేధించడం ప్రారంభించాడు. అవికాస్తా పెద్దగామారడంతో ఆమెను అంతమొందించాలనుకున్నాడు.
ఇందులో భాగంగా ఈ నెల 15న రాత్రి భార్య స్నేహకు మద్యం తాగించాడు. మరుసటి రోజు ఉదయం 5 గంటల సమయంలో ఆమె పొట్టపై కూర్చుని, ముఖంపై మెత్తను పెట్టి ఊపిరాడకుండా చేసి ఆమెను హతమార్చాడు. ఈ క్రమంలో ఆమె కడుపులో ఉన్న గర్భస్థ బిడ్డ కూడా బయటకొచ్చి మరణించింది. అనంతరం ఈ అమానవీయ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు.. వంటగదిలోని గ్యాస్ సిలిండర్‌ను తీసుకొచ్చి గ్యాస్ లీకయ్యేలా పైపును బయటకు తీసి అక్కడి నుంచి పారిపోయాడు.
అయితే సిలిండర్‌లో గ్యాస్ లేకపోవడంతో అదికాస్తా బెడిసికొట్టింది. జనవరి 18న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భర్తపై అనుమానంతో అతని కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కాచిగూడలో దొరడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో విచారించగా హత్య విషయం బయటకు వచ్చింది.