KPHB | కేపీహెచ్బీ కాలనీ, జనవరి 19: కేపీహెచ్బీ కాలనీలోని గోవర్ధనగిరి కొండపై కళ్యాణ మండపాన్ని హౌసింగ్ బోర్డు అధికారులు సీజ్ చేశారు. ఎన్నో ఏండ్లుగా గోవర్ధనగిరి కొండపై వేణుగోపాల స్వామి, ఆంజనేయస్వామి ఆలయాలతో పాటు కల్యాణ మండ పం, గోశాలలు ఉన్నాయి. ఈ దేవాలయ ప్రాంగణంలో నిర్వహించే ఉత్సవాల కోసం కల్యాణ మండపాన్ని నిర్మించగా, ఈ మండపంలో స్వామివారి కల్యాణ వేడుకలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు లేనప్పుడు స్థానికులు పెండ్లీలకు, ఇతర శుభ కార్యక్రమాలకు మండపాన్ని వినియోగిస్తున్నారు. కొన్నేండ్లుగా కొనసాగుతున్న కల్యాణ మండపానికి గతంలో ఏనాడు నోటీసులు ఇవ్వలేదు. కాగా, శనివారం అకస్మాత్తుగా హౌసింగ్ బోర్డు వెస్ట్రన్ డివిజన్ అధికారులు వచ్చి మండపాన్ని సీజ్ చేసి వెళ్లిపోయారు. ఈ విషయం కేపీహెచ్బీ కాలనీలో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో హౌసిం గ్ బోర్డు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రం లో ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గుడులకు కూడా రక్షణ లేకుండా పోయిందని, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. కూకట్పల్లి పరిసర ప్రాం తాలలో ఎన్నో ఎకరాల హౌసింగ్ బోర్డు స్థ లం అన్యాక్రాంతమైనా పట్టించుకోని అధికారులు, వేణుగోపాల స్వామి దేవాలయంలోని కల్యాణ మండపాన్ని ఎందుకు సీజ్ చేయాల్సివచ్చింది? అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం లో హౌసింగ్ బోర్డు ఎస్ఈ, ఈఈలను వివరణ కోరితే వారు స్పందిండం లేదు. కింది స్థాయి అధికారులు మాత్రం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కల్యాణ మండపాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. మిగిలిన విషయాలను వారినే అడగాలని చెబుతున్నారు.