బోరబండ ప్రధాన రహదారిపై సైట్-1 కాలనీ సమీపంలో రోడ్డు మలుపు వద్ద ఇటీవల ఓ హోటల్‌ను ప్రారంభించారు. అయితే నిర్వాహకులు వాహనాల పార్కింగ్ కోసం ఏకంగా రోడ్డును ఆక్రమించి చదును చేశారు. ఫిర్యాదు అందుకున్న బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు హుటాహుటినా సిబ్బందితో అక్కడికి చేరుకొని.. ఆక్రమణను తొలగించారు. అధికారుల తక్షణ స్పందనను చూసిన స్థానికులు.. ఎంతో సంతోషించారు.
ఇక్కడ సీన్ కట్ చేస్తే.. మరుసటి రోజే సదరు హోటల్ నిర్వాహకులు మళ్లీ రోడ్డును ఆక్రమించి.. వాహనాల పార్కింగ్‌కు అనువుగా మలుచుకున్నారు. తొలుత విపరీతంగా స్పందించిన అధికారులు.. రెండోసారి మాత్రం పట్టించుకోకపోవడంతో స్థానికులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. హోటల్ యాజమాన్యం నుంచి అధికారులకు ‘మర్యాదలు’ జరిగాయని, అందుకే రోడ్డు ఆక్రమణను చూసీచూడనట్లు వదిలేస్తున్నారంటూ..స్థానికులు చెబుతున్నారు.
-ఎర్రగడ్డ, ఆగస్టు 18