వెంగళరావునగర్, జూలై 15: అభం శుభం తెలియని పసివాడిపై కర్కశంగా విరుచుకుపడ్డారు ఆ రాక్షసులు. పసివాడిపై పైశాచికంగా దాడికి పాల్పడ్డారు. నాడీ సంబంధిత వ్యాధితో బాధపడ్తున్న బాలుడని చెప్పినా కనికరం చూపకుండా విచక్షణ మరిచి కర్కశంగా వ్యవహరించారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. నల్లకుంటకు చెందిన జనరల్ సర్జన్ డాక్టర్ డీ కృష్ణ, అతని భార్య కిరణ్మయి, ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తెను తీసుకుని సోమవారం అమీర్పేట్ మైత్రీవనంలోని యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయంలో ఉన్న ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లారు.
ఆధార్ కార్యాలయం ఉన్న మూడో ఫ్లోర్లోనే హార్టికల్చర్ కార్యాలయం ఉంది. ఈ దంపతుల ఆరేళ్ల కుమారుడు ఆటిజం స్పెక్టమ్ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఆ బాలుడు హార్టికల్చర్ కార్యాలయం డోర్ పట్టుకుని ఆడుకోసాగాడు. కోపంతో రగిలిపోయిన హార్టికల్చర్ ఉద్యోగిని రమాదేవి బాలుడి చెంపలపై కొట్టింది. దీంతో బాలుడి తండ్రి డాక్టర్ డీ కృష్ణ సదరు ఉద్యోగిని వారించి అడ్డుకోబోయాడు. ఈ క్రమంలో ఉద్యానశాఖ ఉద్యోగులు శ్యామ్యూల్, వెంకట్ రెడ్డి వచ్చి అమాంతంగా వైద్యుడిని కార్యాలయం లోపలికి లాక్కెళ్లి పిడిగుద్దులతో కొట్టి.. కాళ్లతో తన్నారు. బిడ్డను, భర్తను కళ్లెదుటే కొడుతుండటంతో పరుగెత్తుకుంటూ వచ్చిన బాలుడి తల్లిని సైతం దుర్బాషలాడిన ఉద్యానశాఖ సిబ్బంది ఆమెను ఈడ్చిపడేశారు. హార్టికల్చర్ ఉద్యోగుల దాడిలో గాయపడిన బాధితులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధీర్ రెడ్డి తెలిపారు.