సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): వలపుల వలతో వృద్ధులను లక్ష్యంగా చేసుకొని ముగ్గురు పాత నేరస్తులైన మహిళలు ట్రాప్ చేస్తుంటారు… వారి హానీట్రాప్‌లో చిక్కుకున్న వారిలో కొందరు పోలీసులను ఆశ్రయిస్తే కేసులు నమోదు చేస్తుండగా.. మరికొందరు పరువు పోతుందని పోలీసుల వద్దకు రావడం లేదు. పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కావడం.. అరెస్ట్ కావడం వరకు బాగానే ఉంటుంది… పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆ కిలేడీలు.. ఏకంగా స్టేషన్లో ఉండే పోలీసులను మచ్చిక చేసుకుంటూ తమ ట్రాప్‌లోకి దింపేస్తున్నారు..
ఇలా ట్రాప్‌లో పడ్డ కొందరు పోలీసులు వారికి వెనుకాల నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.. హానీ ట్రాప్‌తో మోసాలు చేస్తుండడం, అందులో ప్రత్యేకంగా వృద్ధులనే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేయడం వంటి ఘటనలు చేస్తున్నారంటే అలాంటి నేరస్తులకు తప్పకుండా శిక్షలు పడేవిధంగా చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది.. కాని అలాంటి వారికి చట్టంలో ఉండే చిన్న చిన్న లోపాలను ఆసరగా చేసుకుంటూ శిక్షల నుంచి బయటపడేసేందుకు కిందిస్థాయిలో ఉండే కొందరు పోలీసులు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ కిలేడీలపై ట్రై కమిషనరేట్ల పరిధిలోను కేసులున్నట్లు సమాచారం కాగా, ఎల్బీనగర్ జోన్‌లోని రెండు పోలీస్స్టేషన్లలో వీరిపై వృద్ధులను టార్గెట్ చేసి మోసం చేసిన మూడు కేసులు నమోదయ్యాయి.
పీడీయాక్టుల భయంతో..!
సూర్యాపేట్‌కు చెందిన ఒక మహిళ మేడ్చల్ ప్రాంతంలో నివాసముండగా, నాగోల్‌కు చెందిన మరో మహిళ ప్రస్తుతం కుంట్లూర్ ప్రాంతంలో, ఇంకో మహిళ కాచిగూడ ప్రాంతంలో నివాసముంటున్నారు. ఈ ముగ్గురు స్నేహితులు. ఇద్దరు నేరం చేస్తే మరొకరు బయట ఉంటూ చక్రం తిప్పుతుంటారు. ప్రస్తుతం కుంట్లూర్ ప్రాంతంలో నివాసముండే సదరు మహిళపై 2013లో చైతన్యపురి, ఎల్బీనగర్లలో వ్యభిచారానికి సంబంధించిన పీటా కేసులు కూడా ఉన్నాయి. అయితే 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవస్థీకృత నేరాలపై ఉక్కుపాదం మోపింది.
ఒకే తరహ నేరం చేస్తూ తమ నేరప్రవృత్తిని మార్చుకోని వారిపై పీడీయాక్టులు పెట్టి, ఆయా కేసుల విచారణను వేగ వంతం చేస్తూ నేరస్తులు బయటకు రాకుండా కోర్టులు శిక్షలు వేసే విధంగా సాక్ష్యాలను ప్రవేశపెడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే నేరస్తులలో వణుకు మొదలయ్యింది. ఈ క్రమంలోనే ఈ భయంతో ముగ్గురు కిలేడీలు కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నట్లు తెలిసింది. అయితే కొన్ని సాంకేతిక పరమైన కారణాలతో మూడేండ్లుగా ట్రై కమిషనరేట్ల పరిధిలో తక్కువగా పీడీయాక్టులు నమోదవుతూ వస్తున్నాయి. ఇదే అదనుగా ఈ ముగ్గురు కిలేడీలు తిరిగి కొత్త తరహ నేరాలకు తెరలేపారు.
హానీ ట్రాప్‌తో…!
బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు కిరాయి ఇండ్ల కోసం తిరుగుతుంటారు. ఈ క్రమంలో ఒంటరిగా కన్పించే వృద్ధులను లక్ష్యంగా చేసుకొని వాళ్లను ట్రాప్ చేస్తారు. 2024లో ఇంటిని కిరాయికి తీసుకుంటామని వెళ్లి, ఇళ్లు చూయిస్తున్న వృద్ధుడిని హాని ట్రాప్ చేసి అతడి మెడలో నుంచి ఒకటిన్నర తులాల బంగారు గొలుసు అపహరించారు. నాగోల్, ఉప్పల్, హయత్‌నగర్ ప్రాంతంలోను ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. నిందితులపై నాగోల్‌లో రెండు కేసులు నమోదయ్యాయి.
హయత్‌నగర్‌లో నమోదైన కేసులో రాజీ కుదిరినట్లు తెలిసింది, అలాగే నాగోల్‌లోని కేసు కూడా రాజీకి ప్రయత్నించగా, వ్యవస్థీకృత నేరాల విషయం కోర్టు దృష్టికి వెళ్లడంతో అది కుదరలేదని సమాచారం. కొట్టేసిన బంగారాన్ని కరిగించడం ఆ తరువాత బ్యాంకులలో కుదవ పెట్టి నగదు తీసుకోవడం చేస్తుంటారు, ఇందుకు ఈ ముఠాకు ఒకరు బ్యాంకులో పనిచేసే అప్రజైర్, బేగంబజార్‌లో పనిచేసే మరో గోల్డ్ స్మిత్‌తో సంబంధాలున్నట్లు పోలీసు వర్గాలలోనే చర్చించుకుంటున్నారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠాకు కోర్టుల నుంచి శిక్షలు పడేవిధంగా చేయాల్సిన పోలీసులు, ఆయా కేసులలో రాజీ కుదర్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ముఠాకు ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, నలుగురు కోర్టు కానిస్టేబుళ్లు, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సైతం సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
వల వేసి లక్షల్లో వసూళ్లు..!
ఈ ముఠా వృద్ధులనే కాదు.. యువకులను సైతం ట్రాప్ చేస్తున్నట్లు సమాచారం. పబ్‌లు, బార్లలోకి వెళ్లి ఒంటరిగా ఉండే వారిని లక్ష్యంగా చేసుకొని మాటలు కలుపుతుంటారు. అలా మాటలు కలిపి స్నేహం చేసుకుంటూ వాళ్లను ముగ్గులోకి దింపుతుంటారు. ఫొటోలు, వీడియోలు తీసి మరి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ లక్షల్లో వసూలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ బ్లాక్‌మెయిలింగ్‌కు గురైన వారు చాలా మంది పోలీసుల వద్దకు వెళ్లకుండా పరువు కాపాడుకునేందుకు లక్షలు ఇచ్చి వారి బ్లాక్‌మెయిలింగ్ నుంచి బయటపడుతున్నట్లు సమాచారం.
ఈ లేడీ త్రయం కొనుగోలు చేసిన ఒక ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్‌కు ఆర్టీఏ ఏజెంట్‌ను ఆశ్రయించారు.ఆఏజెంట్తో స్నేహం చేసి అతడితో బార్లు, పబ్‌లకు దిగి దఫ ద ఫాలుగా అతడి వద్ద నుంచి రూ. 25 లక్షల వరకు వసూలు చేశారు.ఆతరువాత డబ్బు లు అడిగితే మా వద్ద నీ ఫొటోలున్నాయం టూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. దీంతో సదరు ఏజెంట్ గప్‌చుప్ అయ్యాడు.
ఒక ఎలక్ట్రానిక్ షాప్‌లోకి వెళ్లిన ఈ లేడీస్ అక్కడ పనిచేసే ఎగ్జిక్యూటివ్‌తో పరిచయం పెంచుకున్నారు. ఆ తరువాత అతడిని ట్రాప్ చేసి దఫ దఫాలుగా రూ. 20 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. పరువు పోతుందని బాధితుడు ఎవరికి ఆ విషయాన్ని చెప్పుకోకుండా గప్‌చుప్ అయ్యాడు.