Holy Mary High School | మెహిదిపట్నం: ఫీజు చెల్లించని విద్యార్థులకు ప్రశ్నాపత్రం ఇవ్వకుండా హోలీ మేరీ హై స్కూల్ యాజమాన్యం మొదటిరోజు పరీక్ష రాయనివ్వలేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వీరికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారా లేక ఫెయిల్ చేస్తారా అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. అయితే మాసబ్ ట్యాంక్ లోని హోలీ మేరీ హై స్కూల్ యాజమాన్యం ఫీజు చెల్లించలేదనే కారణంగా విద్యార్థుల పట్ల ఆక్రోషాన్ని ప్రదర్శించింది.
రూ.1000, రూ.2000 బకాయిలు ఉన్న విద్యార్థులను కూడా మొదటిరోజు పరీక్షలు రాయనివ్వకుండా అడ్డుకున్నారు. స్కూల్ ఫీజు చెల్లించని విద్యార్థులకు హాల్ టికెట్లను జారీ చేసినా..పరీక్ష రాయించినా ఉద్యోగంలో నుంచి పీకేస్తానంటూ ఉపాధ్యాయులకు ప్రిన్సిపాల్ మీనా వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఉపాధ్యాయులు పరీక్ష హాల్లో కూర్చున్న, ఫీజు చెల్లించని విద్యార్థుల చేతుల్లోని ప్రశ్నపత్రాలను జవాబు పత్రాలను లాక్కున్నారు. గంటలపాటు విద్యార్థులను పరీక్ష హాల్ బయటే నిల్చో పెట్టారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హోలీ మేరీ హై స్కూల్ ప్రిన్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యార్థులను పరీక్షలు రాయనివ్వకుండా వేధింపులకు గురిచేయడాన్ని తల్లిదండ్రులు తీవ్రంగా ఖండించారు.
ప్రభుత్వం తక్షణమే హోలీ మేరీ హై స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ పై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మొదటి రోజు పరీక్ష రాయని తమ పిల్లల భవిష్యత్ ఏమిటని తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ మీనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రిన్సిపాల్.. పరీక్ష రాయని విద్యార్థులకు చివరి రోజున మళ్లీ పరీక్ష రాయించే అవకాశం కల్పిస్తామని సమాధానం ఇవ్వడంతో తల్లిదండ్రులు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా, ఆసిఫ్‌నగర్ మండల డిప్యూటీ డీవో రమణ రాజును వివరణ కోరగా గురువారం పరీక్ష రాయిస్తామని చెప్పారు.