సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఇంటి నుంచి మెట్రో స్టేషన్ వరకు, అక్కడి నుంచి పనిచేసే కార్యాలయాల వరకు ప్రజా రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకు రావాల్సిన బాధ్యత హెచ్‌ఎంఆర్‌పై ఉంది. నగరంలో మెట్రో సేవలు ప్రారంభమై ఆరేండ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ సరైన లాస్ట్ మైల్ కనెక్టివిటీ సౌకర్యం లేదని మెట్రో ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ కారణంగా ప్రయాణికులు ఇంటి నుంచి మెట్రో స్టేషన్ వరకు తమ సొంత వాహనాల్లోనే వస్తున్నారు.
టర్మినల్ స్టేషన్లు అయిన నాగోల్, మియాపూర్, ఎల్బీనగర్, రాయదుర్గం, పరేడ్ గ్రౌండ్, అమీర్‌పేట ,హబ్సిగూడ మెట్రో స్టేషన్ వంటి ప్రాంతాల్లో వేలాది వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఇప్పటికే మెట్రో చార్జీలు ఎక్కువగా ఉన్నాయని, అయినా త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని మెట్రోలో ప్రయాణిస్తున్నారు. అయితే ఇదే అదునుగా భావిస్తున్న అధికారులు పార్కింగ్ ఫీజులు సైతం పెంచుతూ ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా 69 కి.మీ మెట్రో నెట్ వర్క్‌లో నిర్మించిన 59 మెట్రో స్టేషన్ల సమీప ప్రాంతాలను ప్రత్యేకంగా షటిల్ సర్వీసులను మెట్రో సంస్థలే నడపాల్సి ఉంటుంది. కానీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ మొక్కుబడి చర్యలతో నెట్టుకొస్తున్నది. లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ప్రముఖ యాప్ అగ్రిగేట్ సంస్థలైన ఓలా, ఉబర్, ర్యాపిడో, మన యాత్రీ వంటి కంపెనీలతో మెట్రో అధికారులు ఒప్పందాలు చేసుకుంటున్నారు.
ఇలాంటి ఒప్పందాల వల్ల రోజు వారీ మెట్రో ప్రయాణికుల లాస్ట్‌మైల్ కనెక్టివిటీ అవసరాలు ఏ మాత్రం తీరడం లేదు. హైదరాబాద్ కేంద్రంగా యాప్ ఆధారిత సంస్థలు తమ సేవలను నగరం నలుమూలలా నిర్వహిస్తూనే ఉన్నాయి. వాటి ధరలు ఎక్కువగానే ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మెట్రో అధికారులు లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనే ముసుగు తొలగించడం ఏమిటని మెట్రో ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
రద్దీ ఎక్కువగా ఉండే మెట్రోస్టేషన్లను గుర్తించి, ఆయా స్టేషన్లకు 3-5 కి.మీ పరిధిలో నిరంతరం ఆటో రిక్షాలు, ఆర్టీసీ బస్సులు,ఇతర ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉండేలా చేస్తేనే లాస్ట్ మైల్ కనెక్టివిటీకి న్యాయం చేసినట్లు అవుతుందని రవాణా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మెట్రో అధికారులు నగరంలో లాస్ట్ మైల్ కనెక్టివిటీ విషయంపై ప్రధానంగా దృష్టి సారించి, షటిల్ సర్వీసులను ఏర్పాటు చేస్తే..మెట్రోలో ప్రయాణించే వారికి సంఖ్య గణనీయంగా పెరుగుతుందనే అభిప్రాయాన్ని నగర వాసులు వ్యక్తం చేస్తున్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రజా రవాణా వ్యవస్థల నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నగరంలో ప్రతి 50 లక్షల జనాభాకు 200 కి.మీ మెట్రో రైల్ నెట్ వర్క్ ఉండాలి. అలాంటిది మన మహానగరంలో ప్రస్తుతం కోటిన్నర జనాభా ఉండగా, భవిష్యత్తులో మరో 2 కోట్ల దాకా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో400 కిలో మీటర్ల మెట్రో రైలు నెట్‌వర్క్‌ను నిర్మించేలా దశల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన హైదరాబాద్ మెట్రో అధికారులు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలానుగుణంగా నగరంలో మెట్రో రైలు మార్గాలను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి, వాటిని నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించి.. ప్రభుత్వానికి అందించాల్సిన మెట్రో అధికారులు.. చిత్తశుద్ధి కనబర్చడం లేదనే ఆరోపణలున్నాయి. ఏయే మార్గాల్లో మెట్రో కారిడార్లను నిర్మించాలో కచ్చితమైన సమాచారంతో ప్రభుత్వాలకు నివేదించాల్సిన మెట్రో యంత్రాంగం విఫలమవుతున్నది. రెండోదశ మెట్రో ప్రాజెక్టులో మరిన్ని మార్గాలను చేపట్టాల్సి ఉన్నా.. ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించిందని నగరవాసులు ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా ఉత్తర హైదరాబాద్ ప్రాంతానికి 3-4 మార్గాల్లో మెట్రో కారిడార్లను పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నా, దాన్ని పక్కన ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతానికి మెట్రో కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు, డీపీఆర్‌లు రూపొందించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లేని నగరానికి మెట్రో మార్గాన్ని నిర్మించడంతో చూపుతున్న చిత్తశుద్ధి ఉత్తర హైదరాబాద్ ప్రాంతమైన మేడ్చల్, శామీర్‌పేట, కుత్బుల్లాపూర్,అల్వాల్, జీడిమెట్ల, దుండిగల్ వంటి ఏరియాలకు ఎందుకు మెట్రో మార్గాలను నిర్మించడం లేదని ప్రశ్నిస్తున్నారు. అధ్యయనం లేకుండానే మార్గాలను ప్రతిపాదించినట్లు మండిపడుతున్నారు.