KCR | సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ) : ఐటీ కారిడార్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కోకాపేట నియో పొలీస్ లేఅవుట్. సుమారు 534 ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసింది. ఒక్కో ప్లాట్ సైజును ఎకరం నుంచి ఏడు ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేశారు. ఈ లేఅవుట్లో అపరిమితంగా అంతస్థులు నిర్మించుకునేందుకు అనుమతి ఉండడంతో రియల్ ఎస్టేట్ సంస్థలు 40 నుంచి 60 అంతస్థుల్లో ఆఫీసు, నివాసం ఉండేందుకు వీలుగా ఆకాశహార్మ్యాలను నిర్మిస్తున్నాయి. ఐటీ కారిడార్‌లో హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలకు గణనీయమైన డిమాండ్ ఉండడంతో ఎక్కడ చూసినా ఈ లేఅవుట్లో ఇలాంటి ప్రాజెక్టులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన కోకాపేట నియోపొలీస్ లేఅవుట్‌ను గ్రీన్ ఫీల్డ్ టౌన్ షిప్‌గా ఉండేలా డిజైన్ చేశారు.
ఈ లేఅవుట్లో అన్ని నిర్మాణాలు పూర్తయితే వచ్చే 5-6 ఏళ్లలోనే దాదాపు 7 లక్షల మంది ఉద్యోగులు పనిచేసేలా వివిధ జాతీయ, అంతర్జాతీయ ఐటీ, ఐటీ ఆథారిత కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డు నుంచి నేరుగా కోకాపేట నియోపొలీస్ లేఅవుట్లోకి వెళ్లేందుకు, వచ్చేందుకు వీలుగా అత్యంత విశాలమైన రహదారులతో ఎలాంటి సిగ్నల్స్ లేకుండా ఓఆర్ఆర్పై వినూత్న శైలిలో ట్రంపెట్‌ను నిర్మించారు. ఈ మొత్తం కోకాపేట నియోపొలీస్ లేఅవుట్ అభివృద్ధి కోసమే హెచ్ఎండీఏ సుమారు రూ.300 కోట్లను వెచ్చించింది. ఇప్పటికే లేవుట్‌లో మౌలిక వసతుల కల్పన పూర్తయి, భారీ బహుళ అంతస్థుల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇక మిగిలిన ఓఆర్ఆర్ ట్రంపెట్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే దీన్ని ప్రారంభించేందుకు హెచ్ఎండీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ముఖ్యంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోకాపేట 20కి.మీ దూరమే ఉండడంతో ఈ ప్రాంతానికి మంచి డిమాండ్ నెలకొన్నది. కోకాపేటకు ఒకవైపు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మరోవైపు గండిపేట జలాశయం ఉండడంతో ఈ ప్రాంతం అందరినీ విశేషంగా ఆకర్షిస్తున్నది. గచ్చిబౌలి చౌరస్తా నుంచి ఔటర్ రింగు రోడ్డు పైకి వెళ్లేందుకు ప్రత్యేక మార్గం ఉంది. అదే తరహాలో కోకాపేట నియో పొలీస్ నుంచి ఓఆర్ఆర్ వైపు వచ్చే వాహనాలు వెళ్లిపోయేలా ట్రంపెట్ నిర్మాణం చేపట్టారు. కేవలం 20 నిమిషాల్లో కోకాపేట నియోపొలీస్ నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా రోడ్లను నిర్మించారు.
గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కోకాపేట లేఅవుట్‌ను చేపట్టింది. గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, గండిపేట ప్రాంతాలను కలుపుతూ లింకు రోడ్లను నిర్మిస్తున్నది. ఇప్పటి వరకు హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్ల కంటే భిన్నంగా కోకాపేట నియో పొలీస్ లేఅవుట్‌ను అత్యంత విశాలమైన రోడ్లతో డిజైన్ చేశారు. 150 అడుగుల నుంచి మొదలుకొని 120, 100 అడుగుల వెడల్పుతో కూడిన రోడ్లను నిర్మిస్తూ, వాటి చుట్టూ బాక్స్ డ్రైయిన్‌ను ప్రత్యేకంగా నిర్మించారు.
కోకాపేటలో ఔటర్ రింగురోడ్డుపై నిర్మిస్తున్న ట్రంపెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ వైపు నుంచి ఓఆర్ఆర్కు మరోవైపు ఉన్న కోకాపేట రావాలంటే ప్రసుత్తం ఉన్న ఇంటర్‌చేంజ్‌లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో కొత్తగా హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన నియో పొలీస్ లేఅవుట్ నుంచి నేరుగా ఓఆర్ఆర్ మీదుగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ చేరుకునేందుకు వీలుగా భారీ ట్రంపెట్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు ఓఆర్ఆర్ మీదుగా వచ్చే వాహనాలు నేరుగా కోకాపేటలోని నియో పొలీస్ లేఅవుట్, గోల్డ్ మైల్ లే అవుట్లోకి, శంకర్పల్లి రోడ్డుకు చేరుకునేలా అత్యున్నత ప్రమాణాలతో నిర్మించారు.