HMDA | సిటీబ్యూరో, జనవరి 23(నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2050 ముసాయిదాకు మరో మూడు నెలల సమయం పట్టేలా ఉంది. ఇప్పటికే ఏడు జిల్లాల మేర విస్తరించిన మహా నగరాభివృద్ధి సంస్థ, వచ్చే 25 ఏండ్లకు అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలు కాగా, ముసాయిదా విడుదలకు ఏజెన్సీలు కసరత్తు చేస్తున్నారు. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్‌లోని మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు, తప్పోప్పులను సరి చేసిన తర్వాత తుది మాస్టర్ ప్లాన్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనుంది. ఈ ఏడాది చివరి నాటికి మాస్టర్ ప్లాన్-2050 అమలులోకి వచ్చే అవకాశం ఉందని, రూపకల్పన ప్రక్రియ వేగంగా సాగుతుందని హెచ్ఎండీఏ వర్గాలు చెబుతున్నాయి.
అమలులో.. ఐదు మాస్టర్ ప్లాన్లు
ప్రస్తుతం, హైదరాబాద్ కేంద్రంగా ఐదు మాస్టర్ ప్లాన్లు అమలులో ఉన్నాయి. ఇందులో ఓల్డ్ మున్సిపాలిటీ, జీహెచ్ఎంసీ, ఎయిర్ పోర్టు ఆథారిటీ, సైబరాబాద్, మాస్టర్ ప్లాన్-2031 అందుబాటులో ఉండగా.., చాలా ప్రాంతాల్లో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ప్రధానంగా మాస్టర్ ప్లాన్ – 2031లో జోన్ల విషయంలో చాలా సమస్యలు నిత్యం తలెత్తుతున్నాయి. దీంతో తప్పులు సరి చేసుకునే క్రమంలో జనాలు ఎన్వోసీలు ఉంటే గానీ నిర్మాణ పనులు చేపట్టే వీల్లేకుండా పోయింది. ఆధునాతన సాంకేతికత సాయంతో గూగుల్ మ్యాపులు, స్థానిక రెవెన్యూ మ్యాపులు, విలేజ్ మ్యాపులు, ఎన్జీఆర్ఐ, ఎన్ఆర్ఎస్సీ క్రోడీకరిస్తున్నారు. ఇక నుంచి ఒకటే మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ఆయా స్థానిక సంస్థలు, ఆథారిటీలు ప్రణాళికలు రూపొందించేలా మాస్టర్ ప్లాన్-2050 ఉంటుందని చెబుతున్నారు.
మూడింటికి ప్రాధాన్యత..
గ్లోబల్ సిటీ అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ – 2050లో ప్రధానంగా మూడు అంశాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చినట్లుగా తెలిసింది. ప్రజా రవాణా, పారిశ్రామిక జోన్లు, అర్బన్ డెవలప్మెంట్కు అవసరమైన మౌలిక వసతులపై దృష్టి పెట్టారు. అదే విధంగా ఓఆర్ఆర్, ట్రిపులార్ మధ్య రేడియల్, గ్రిడ్ రోడ్లు, ఇంటర్నల్ రహదారులు, మెట్రో విస్తరణ, జాతీయ రహదారులు, విమానాశ్రయంతో అనుసంధానం, జనాభాకు అనుగుణంగా ప్రజా రవాణా అభివృద్ధికి వీలు ఉండేలా మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతుందని తెలిపారు. 2008లో తెచ్చిన మాస్టర్ ప్లాన్‌లో ఉన్న తప్పుల కారణంగా ఇప్పటికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా మాస్టర్ ప్లాన్ సిద్ధం అవుతుందని హెచ్ఎండీఏ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త మాస్టర్ ప్లాన్‌లో నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాలోని పలు మండలాలు కూడా కలుపుతారని తెలిసింది.