HMDA | ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే హెచ్ఎండీఏ లక్ష్యం. అలాంటి సంస్థ పదేండ్లలో ఎన్నో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. కోర్ సిటీతో పాటు నగర శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రకరకాల ప్రాజెక్టు పనులను నిర్వహిస్తోంది. గతమెంతో ఘనంగా పేరుగాంచిన హెచ్ఎండీఏ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు. పురోగతిలో ఉన్న ప్రాజెక్టు పనులను సైతం పక్కన పెట్టి.. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టారు. 5 నెలలుగా హెచ్ఎండీఏలో ఇదే పరిస్థితి ఉన్నదని అధికారులు ,ఉద్యోగులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రాజెక్టుల పనులను పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను నిలిపివేసిన పరిస్థితి నెలకొన్నది.
మియాపూర్ నుంచి మేడ్చల్ వెళ్లే మార్గంలో బాచుపల్లి, నిజాంపేట క్రాస్ రోడ్డు వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణ పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. రోడ్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణాలే కాకుండా హెచ్ఎండీఏ పలు చోట్ల అభివృద్ధి చేసిన లే అవుట్లలో మౌలిక వసతుల కల్పన పెండింగ్‌లో ఉన్నది. నగర శివారులోని తొర్రూర్‌లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్లో రెండు దశల్లో ప్లాట్లను విక్రయించారు. ఆ లే అవుట్లో మొదటిసారి 2022 జూలైలో ప్లాట్లను ఆన్లైన్ వేలంలో విక్రయించారు. అప్పటి నుంచి 18 నెలల్లో లే అవుట్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేసిన లే అవుట్‌ను కొనుగోలుదారులకు అప్పగించాల్సి ఉంటుంది.
లే అవుట్ అభివృద్ధి పనులు మొదలు పెట్టినా, ఆ తర్వాత 5 నెలల నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే అగిపోయాయి. తొర్రూర్ లే అవుట్లో అభివృద్ధి పనులు పూర్తి చేయకపోవడంపై యజమానులు హెచ్ఎండీఏపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఊరుకోకుండా హెచ్ఎండీఏ తీరుపై కోర్టును ఆశ్రయించారు. విషయం కోర్టు దాకా వెళ్లడంతో ఆ కాంట్రాక్టరుతో చర్చించి మళ్లీ పనులు మొదలు పెట్టినా, అది ఎప్పటికీ పూర్తవుతుందో, బిల్లులు చెల్లిస్తారో చెప్పలేని పరిస్థితి.