Fancy Number | సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : ఎప్పుడైనా 9999 నంబర్ అత్యధిక ధర పలికి హవా సృష్టించేది. కానీ ఈ ఏడాది ప్రారంభ నంబర్ ప్రక్రియలో 9999 రెండు సార్లు రెండో స్థానానికి పడిపోయింది. గతంలో ఆన్లైన్ నంబర్ల బిడ్డింగ్‌లో 9999ను సొంతం చేసుకోవడానికి వాహనదారులు పోటీ పడేవాళ్లు. ఈ సారి ఆ నంబర్ అత్యంత తక్కువ ధర పలకడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది.
తాజాగా శుక్రవారం జరిగిన ఆన్లైన్ ఫ్యాన్సీ బిడ్డింగ్ వేలంలో 9999 నంబర్ కేవలం రూ.6.26 లక్షల ధర మాత్రమే పలికింది. ఈ నంబర్‌ను ఎటర్నల్ ఎవెన్యూ ఇన్ఫ్రా స్ట్రక్చర్ సొంతం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. 9999 నంబర్ కంటే 0009 నంబర్ ధర అధికంగా పలికింది. అత్యధికంగా రూ.10.46 లక్షలకు వెంకటేశ్ గౌడ్ అనే వ్యక్తి దక్కించుకున్నట్టు అధికారులు చెప్పారు.
ఇటీవల జరిగిన వేలంలోనూ టీజీ 09 సీ 9999 నంబర్ రూ.7.19లక్షల ధర మాత్రమే పలికింది. ఈ నంబర్‌ను శ్రియాన్ కన్స్ట్రక్షన్ కైవసం చేసుకున్నది. 0001 నంబర్‌ను రూ.4.69లక్షలకు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కైవసం చేసుకున్నారు. 0005 నంబర్ రూ. 2.43 లక్షలకు కారా కౌన్సిల్ లిమిటెడ్ దక్కించుకున్నట్టు ఆర్టీఏ అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది నుంచి ఫ్యాన్సీ నంబర్ల వేలం ధరలు పడిపోతుండటం పలు అనుమానాలకు తావిస్తున్నదని వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.