సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ)/బడంగ్‌పేట : అర్ధరాత్రి ఆకతాయిల హల్చల్తో జరుగుతున్న హత్యలు, హత్యాయత్నాల ఘటనలను రాచకొండ పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. బీర్ బాటిళ్లు, కత్తులతో దాడులు చేసే గంజాయి బ్యాచ్‌లను గుర్తించి.. సమాజానికి హాని కలిగించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నారు. నగర వ్యాప్తంగా బోనాల వేడుకలు జరుగుతుండగా.. మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి.
నగర శివారుల్లో గంజాయి విక్రయాలు కట్టడి చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, కొందరు పాత నేరస్తులు రహస్యంగా గంజాయి క్రయ, విక్రయాలు చేస్తూ యువతను పెడదారి పట్టిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మీర్‌పేట పరిధిలో మద్యం దుకాణాలు ఆదివారం మూసివున్నాయి. సోమవారం తెరిచారు. అలాగే , పక్కనే ఉన్న ఎల్బీనగర్లో డివిజన్లో ఆది, సోమవారాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. అయితే, కొందరు ఈ ఉత్తర్వులను ఉల్లంఘించారు. ఎల్బీనగర్ డివిజన్‌తో పాటు హైదరాబాద్ సౌత్‌జోన్ వైపు కూడా మద్యం దుకాణాలు మూసి ఉండటంతో అటు నుంచి వచ్చిన వారితో తెరిచి ఉన్న మద్యం దుకాణాలు కిక్కిరిశాయి. తమకు వచ్చిన గిరాకీని పోగొట్టుకోకుండా అర్ధరాత్రి వరకు నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అల్లరిమూక మద్యంతో పాటు గంజాయి సేవించి అర్ధరాత్రి రోడ్లపై చేస్తున్న చిల్లర చేష్టలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలపై సీపీ స్పందించారు. కిందస్థాయి ఉద్యోగుల్లో నిర్లక్ష్యం ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.