సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): గేటెడ్ కమ్యూనిటీల్లో అధిక చార్జీల వసూళ్లపై ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో నివసించేవారికి నిర్వహణ చార్జీలు ఏకరీతిన ఉండాలనే డిమాండ్ ఏళ్లనుంచి వినపడుతోంది. ఈ క్రమంలో ఫ్లాట్ సైజు, వాణిజ్య అవసరాలను బట్టి అసోసియేషన్లు ఇష్టానుసారంగా మెయింటెనెన్స్ ఫీజులు విధించకూడదనే చర్చ నడుస్తుండగా.. తాజాగా ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పు అధిక చార్జీల భారాన్ని మోపే గేటెడ్ కమ్యూనిటీలకు ప్రతిబంధకంగా మారనుంది.
కామన్ మెయింటెనెన్స్ సేవలన్నింటినీ అందరూ సమానంగా వాడుకుంటున్నప్పుడు, కేవలం ప్లాట్ సైజు పెద్దదిగా ఉందనే కారణంగా ఎక్కువ మెయింటెనెన్స్ ఫీజులు వసూలు చేయడం ముఖ్యంగా క్లబ్ హౌజ్, స్మిమ్మింగ్ పూల్, సెక్యూరిటీ, పార్కులు, లిఫ్టుల విషయంలోనే అధిక ఫీజులు సమర్ధనీయం కాదని, అందరికీ సమాన చార్జీలే వసూలు చేయాలని ముంబై హైకోర్టు స్పష్టం చేసింది. అయితే కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో వ్యాపార సముదాయాలు, షాపుల నుంచి భిన్నమైన రేట్లు వసూలు చేయడానికి సంబంధించి తగిన ఆధారాలు, బైలాస్ ప్రాతిపదికన స్పష్టమైన వివరణ ఇవ్వడంలో కొన్ని అసోసియేషన్లు విఫలమవుతున్నాయి. కానీ చార్జీల వసూళ్లను మాత్రం చట్టబద్ధంగా వసూలు చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.
సరైన నిబంధనలు, బైలాస్ లేకుండా కొన్ని అసోసియేషన్లు నిర్వహణ పేరిట, నీటి కనెక్షన్ల బిల్లుల్లోనూ వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ క్రమంలో రెసిడెన్షియల్ అసోసియేషన్లకు బైలాస్ అత్యంత కీలకమని కోర్టు వ్యాఖ్యానించింది. చట్టబద్ధత లేని అసోసియేషన్లు నిర్వహణ పేరిట వసూళ్లు చేసే అంశంపై నివాసితులు ప్రశ్నించే హక్కు కూడా ఉంటుందనీ, కామన్ ఫెసిలిటీల వ్యయాన్ని సభ్యులందరికీ సమానంగా పంచాలా? లేక చదరపు అడుగు లెక్కన వసూలు చేయాలా అనే దానిపై స్పష్టంగా పేర్కొంటూ బైలాస్ రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టు తీర్పు ఆధారంగా ఎలాంటి చట్టబద్ధత లేని అసోసియేషన్లు అడ్డగోలుగా నిర్వహణ చార్జీలను వసూలు చేయడాన్ని నిలువరిస్తుందనీ ఆర్డబ్ల్యూఏ ప్రతినిధులు పేర్కొన్నారు. నివాసితులకు సమానమైన బాధ్యత, హక్కులు ఉంటాయని, విస్తీర్ణం పేరిట కామన్ ఫెసిలిటీలపై చార్జీలను నిలువరించడంలో బైలాస్ ముఖ్య పాత్ర పోషిస్తుందని, రెసిడెంట్ అసోసియేషన్లు పేర్కొన్నాయి.
ప్రతీ గేటెడ్ కమ్యూనిటీలో క్లబ్ హౌజ్, స్మిమ్మింగ్ పూల్, సెక్యూరిటీ, పార్కులు, లిఫ్టుల వంటి ఉమ్మడి సౌకర్యాలను సభ్యులందరూ సమానంగానే వినియోగిస్తారు. అయితే కొన్ని అసోసియేషన్లు ప్లాట్ చదరపు అడుగుల వైశాల్యాన్ని బట్టి, లేదా కమ్యూనిటీలోని కమర్షియల్ యూనిట్లకు రెట్టింపు రేటుతో చార్జీలను వసూలు చేస్తున్నాయి. దీనిపై అసంతృప్తి చెందిన నివాసితులు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విస్తృత స్థాయిలో జరిగిన విచారణ అనంతరం చట్టబద్ధత లేని అసోసియేషన్లు, బైలాస్కు అతిక్రమించి అదనపు, అధిక నిర్వహణ చార్జీలను వసూలు చేయడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది.