
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వేలం వేసిన 49.95 ఎకరాల కోకాపేట భూముల్లో వర్షం నీరు, మురుగునీటి పారుదలపై అధ్యయన నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హెచ్ఎండీఏ కూడా అధ్యయనం చేయాలని సూచించింది. కోకాపేట భూముల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తే ఆ సరస్సుల పరీవాహక ప్రాంతాలు దెబ్బతినేలా ఉన్నాయని అధ్యయన నివేదికల్లో తేలితే మాత్రం నిర్మాణాలను చేపట్టవద్దని ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పింది. ఇదే జరిగితే వేలం సొమ్మును ప్రభుత్వం తిరిగి ఇవ్వాల్సి వస్తుందని తెలిపింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ పరీవాహక ప్రాంతాల పరిరక్షణకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 111 పరిధి నుంచి వట్టినాగులపల్లి ప్రాంత ప్రైవేట్ భూములకు మినహాయింపు ఇవ్వాలని దాఖలైన వ్యాజ్యాలను బుధవారం న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారించింది.
ప్రభుత్వ భూమి విషయంలో ఒకలా, ప్రైవేట్ భూముల విషయంలో మరోలా ఉంటే ఎలాగని ప్రశ్నించింది. ప్రైవేట్ భూముల విషయంలో ఎన్జీఆర్ఐ నివేదిక వచ్చే వరకూ వేచి ఉండాలని అధికారులు చెబుతున్నారని, అదే కోకాపేట భూముల విషయంలో ఎందుకు చెప్పడం లేదనే సందేహాన్ని వ్యక్తం చేసింది. దీనిపై అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ, కోకాపేట భూములు జీవో 111 పరిధిలోకి రానేరావన్నారు. కోకాపేట భూములు వేలం వేయాలన్నది ప్రభుత్వ నిర్ణయమన్నారు. రెంటిండికీ సంబంధం లేనేలేదని చెప్పారు. కోకాపేటలో వేలం వేసిన భూముల్లో నిర్మాణాలు చేస్తే ఒక చుక నీరు కూడా సరస్సులకు చేరదని హెచ్ఎండీఏ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని హైకోర్టు రికార్డుల్లో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.
మురుగునీరు పారేలా ఏర్పాట్లు చేసిన తర్వాతే కోకాపేట భూముల్లో నిర్మాణాలకు అనుమతి ఉంటుందన్నారు. ఇదే విధంగా వట్టినాగులపల్లి భూముల విషయంలోనూ చేయవచ్చు కదా అని హైకోర్టు అడిగింది. తిరిగి ఏజీ కల్పించుకుని, ఎన్జీటీలో వట్టినాగులపల్లి భూముల కేసు నడుస్తోందని, అందుకే ఆ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదన్నారు. వట్టినాగులపల్లి భూములపై ప్రభుత్వం 2018లో కమిటీ ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ నివేదిక అందాల్సి ఉందని చెప్పారు. వాదనల తర్వాత కోకాపేట భూముల వేలానికి ముందున్న రికార్డులను సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.