సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సైకిల్ ట్రాక్‌లు ఉన్నా, హైదరాబాద్‌లో నిర్మించిన సైకిల్ ట్రాక్ రూపకల్పన ఎంతో ప్రత్యేకమైందని, దేశంలోనే మొదటిది కాగా.. ప్రపంచంలో రెండోదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ.రామారావు అన్నారు. ఆదివారం రాత్రి నార్సింగిలో ఔటర్‌రింగు రోడ్డు వెంబడి 23కి.మీ మేర రెండు మార్గాల్లో నిర్మించిన సోలార్ రూఫ్‌టాప్ సైకిల్ ట్రాక్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… హైదరాబాద్ సైక్లింగ్ ట్రాక్ గత ఏడాది ఆగస్టులో సౌత్ కొరియాలో ఉన్న సోలార్ కవర్ సైకిల్ ట్రాక్‌పై ఒక ట్వీట్‌తో ప్రారంభమైందని, ఏడాది కాల వ్యవధిలోనే 23 కి.మీ దూరం ఉన్న సోలార్ రూఫ్‌టాప్ సైకిల్ ట్రాక్‌ను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్మించిందన్నారు. ప్రపంచంలో దక్షిణ కొరియా తర్వాత హైదరాబాద్‌లో రెండో సోలార్ రూఫ్‌టాప్ సైకిల్ ట్రాక్ ఉందని, ఇలాంటివి ఇప్పుడు దుబాయ్, స్విట్జర్లాండ్‌లో కూడా నిర్మాణంలో ఉన్నాయన్నారు. దేశంలో ఈ రకమైనది ఇది ఒక్కటే ఉందన్నారు. ఔటర్ రింగు రోడ్డు వెంబడి నిర్మించిన ట్రాక్‌లలో ట్రాక్‌కు ఇరువైపులా రక్షణ, భద్రత ఏర్పాట్లు చేశారని, దీంతో సైకిలిస్టులకు పూర్తిగా సురక్షిమైందని మంత్రి పేర్కొన్నారు.
24గంటల పాటు ఓపెన్‌గా..
ఐటీ కారిడార్‌లోని ఓఆర్ఆర్ వెంబడి నిర్మించిన సైకిల్ ట్రాక్ ఏడాది పొడవునా 24/7 తెరిచే ఉంటుందని, రాత్రి వేళల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ దీపాలు వెలిగేలా ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లడించారు. సుమారు 16 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్యానల్స్ సైకిల్ ట్రాక్ పైభాగంలో బిగించారని, ఇందులో 16వేల సౌర పలకలను కేవలం 18 రోజుల్లోనే బిగించారన్నారు. ట్రాక్ వెంట సీసీటీవీలు, సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉంటుందని, త్వరలో సైకిళ్లను అద్దెకిచ్చే ఏజెన్సీలు వస్తాయన్నారు. ఇవే కాకుండా సైకిల్ ట్రాక్ వెంబడి ఆరోగ్యకరమైన పదార్థాలు, రిటైల్ కియోస్క్‌లు, స్కేటింగ్ రింగ్, టెన్నిస్ కోర్టులు, బ్యాడ్మింటన్ కోర్టులు, స్పోర్టింగ్ రిటైల్ షాపులను ఏర్పాటు చేస్తామన్నారు. సైకిల్ ట్రాక్ నిర్వహణను టెండర్లలో భాగంగా 5 ఏండ్లపాటు నిర్వహించేలా కేఎంవీ ప్రాజెక్టుకే ఇచ్చామని, ఈ సంస్థ అన్ని కార్యకలాపాలు చేపడుతుందన్నారు. మొత్తంలో దేశంలోనే ఒక రకమైన క్రీడా కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 6 ఏండ్లలోనే దీనికోసం పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని, అదేవిధంగా మొత్తం 23 కి.మీ మేర నిర్మించిన ప్రాజెక్టు ద్వారా 14-15 ఏండ్లలోనే పెట్టిన పెట్టుబడి అంతా తిరిగి వచ్చేలా దీన్ని చేపట్టామని మంత్రి పేర్కొన్నారు.
గండిపేట చుట్టూ 46 కి.మీ సైకిల్ ట్రాక్
ప్రస్తుతం ఐటీ కారిడార్‌లో నిర్మించిన 23 కి.మీ సైకిల్ ట్రాక్‌తోనే సరిపెట్టమని, దీనికి పొడిగింపుగా కోకాపేట నియో పోలీస్ లేఅవుట్, ఫైనాన్సియల్ డిస్ట్రిక్, బుద్వేల్ ఐటీ పార్కుల్లో ప్రత్యేకంగా సైకిల్ ట్రాక్‌లను నిర్మించాలన్న ప్రతిపాదన ఉందన్నారు. అదేవిధంగా ఇక్కడికి సమీపంలోనే ఉన్న గండిపేట చెరువు చుట్టూ 46 కి.మీ పొడవునా సైకిల్ ట్రాక్‌ను నిర్మించాలన్నది తన కల అని, ఇప్పటికే దాన్ని చేపట్టాలని నిర్ణయించామని, త్వరలోనే ఆ ప్రాజెక్టును చేపడుతామని మంత్రి చెప్పారు. అంతటితో ఊరుకోకుండా హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ సైక్లింగ్ పోటీలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు హైదరాబాద్ కేంద్రంగా చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు జి.రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ కె.నవీన్‌కుమార్, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ అనితాహరినాథ్ రెడ్డి, నార్సింగి మున్సిపల్ చైర్మన్ రేఖా యాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేశ్ యాదవ్, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రా మహేందర్ గౌడ్, ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్‌కుమార్, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్, హెచ్‌జీసీఎల్ పూర్వ ఎం.డి బీ.ఎం.సంతోష్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ సీజీఎం రవీందర్, హైదరాబాద్ సైక్లింగ్ గ్రూపు ప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
లఘు చిత్ర ప్రదర్శన….
సోలార్ రూఫ్‌టాప్ సైకిల్ ట్రాక్ ప్రారంభం సందర్భంగా నార్సింగి మై హోం అవతార్ జంక్షన్లో హైదరాబాద్ అభివృద్ధిపై రూపొందించిన లఘు చిత్ర ప్రదర్శన చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందిన తీరు, ప్రభుత్వం నగరంలో కల్పించిన మౌలిక వసతులపై ఈ లఘుచిత్రాన్ని రూపొందించారు.
నగరంలో 10వేల మంది సైక్లిస్టులు
సైక్లింగ్ పట్ల నగర వాసుల్లో ఎంతో ఆసక్తి ఉన్నది. అందుకు నిదర్శనమే నగరంలోనే 10వేల మంది సైకిలిస్టులు ఉన్నారు. వీరిలో చాలా మంది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ైస్లెకింగ్ ట్రాక్‌ను వినియోగించుకునే అవకాశం ఉన్నది. వీరితోపాటు కొత్తగా మరింత మంది సైక్లింగ్ చేసేందుకు ఆసక్తిని చూపే అవకాశం ఉన్నది. సైకిల్ ట్రాక్ పొడవునా కల్పించిన మౌలిక వసతులు ఎంతో అద్భుతంగా ఉన్నాయంటూ పలువురు సైకిలిస్టు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడించారు.