Rains | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం వాన దంచికొట్టింది. దీంతో గత నాలుగైదు రోజుల నుంచి ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ నగర వాసులకు ఉపశమనం లభించింది. ఇక భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 4.5 సెంటీమీటర్లు, కూకట్‌పల్లిలో 2.4, కుత్బుల్లాపూర్‌లో 2.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
కూకట్పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, ప్రగతినగర్, కాప్రా, ఈసీఐఎల్, సైనిక్‌పురి, చందానగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, తిరుమలగిరి, బొల్లారం, బోయిన్పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, బేగంపేట, ఆల్వాల్, తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్, హబ్సిగూడ, ప్యాట్నీ, నాచారం, మల్లాపూర్, నాగారం ప్రాంతాల్లో వర్షం పడింది.
వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం వేళ వర్షం కురియడంతో.. నివాసాలకు వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లోని మనోహర్ థియేటర్ సమీపంలో రహదారిపై మోకాళ్ల లోతు వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కూకట్‌పల్లిలో సాయంత్రం కురిసిన మోస్తరు వర్షానికే మెయిన్ మార్కెట్ రోడ్ చెరువును తలపించింది. నీరు నిలవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతోనే, ఈ పరిస్థితి నెలకొందని, షాపులలోకి నీరు చేరుతుందని, రాత్రి సమయంలో వర్షం కురిస్తే దేవుడే దిక్కని చిరు వ్యాపారులు, షాపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.