Hyderabad Rains | కొండాపూర్/శేరిలింగంపల్లి, జూన్ 12 : హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి చందానగర్ ప్రధాన రహదారిలోని సెల్లార్లు నీటమునిగాయి. వేముకుంటలోని పలు ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరింది. దీంతో ప్రలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
సరైన డ్రైనేజీ వ్యవస్థ, వరద నీరు వెళ్లేందుకు కాలువలు లేకపోవడం వల్లే ఇలా ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలం ప్రారంభానికే పరిస్థితులు ఇలా ఉంటే.. మున్ముందు ఎలా ఉండబోతుందోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
#WATCH | Parts of Hyderabad city witness waterlogging issues after the city was lashed by heavy rainfall.
Visuals from Santosh Nagar and Champapet areas. pic.twitter.com/cMooFXtmsU
— ANI (@ANI) June 12, 2025
శేరిలింగంపల్లిలో రహదారులు జలమయం.. నిలిచిపోయిన రాకపోకలు
శేరిలింగంపల్లిలో పలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఇక్కడి పలు ప్రాంతాలు వరదనీటితో నిండిపోయాయి. ప్రధానంగా శేరిలింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతంలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. బ్రిడ్జికి ఇరువైపులా వరద నీరు ముంచెత్తడంతో పూర్తిగా ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాపిరెడ్డి కాలనీ రాకపోకలు సైతం నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శేరిలింగంపల్లిలో..
లింగంపల్లి తారా నగర్ పాపిరెడ్డి కాలనీ ప్రాంతాల ప్రజలతోపాటు పరిసర ప్రాంతాల వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో పాటు లింగంపల్లి మెహదీపట్నం ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. డోయాన్స్ కాలనీ సమీపంలో పెట్రోల్ బంకు, ప్రధాన రహదారిపై మోకాళ్ళ లోతు వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. లింగంపల్లి వైపు నుంచి గచ్చిబౌలి మాదాపూర్ ఐటీ కారిడార్ లకు వెళ్లే ఐటీ ఉద్యోగులు, వాహనదారులను హైడ్రా అధికారులు ట్రాఫిక్ పోలీసులు దారి మళ్ళించారు.
శేరిలింగంపల్లిలో..
శేరిలింగంపల్లిలో..
శేరిలింగంపల్లిలో..
ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమ బంగాళాఖాతం వరకు కొనసాగిన ఆవర్తన ద్రోణి బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఈనెల 17వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.
బుధవారం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాతోపాటు ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. గురు, శుక్ర, శని, ఆదివారాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వివరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్టు తెలిపింది. రాబోయే 48 గంటలు ఆకాశం మేఘావృతమై ఉండి, హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతోపాటు, ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. 24 గంటల్లో భద్రాది కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో అత్యధికంగా 8.22 మి.మీ వర్షపాతం నమోదైనట్టు తెలిపింది.
నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన మొదటి పది రోజుల్లో కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ-గద్వాల, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో అత్యంత లోటు వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. మహబూబాబాద్, నాగర్కర్నూల్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సిద్దిపేట, జనగాం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని పేర్కొన్నది. జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కాగా, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో అత్యంత అధిక వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.