సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో భారీ వర్షాలు కురుస్తున్న దరిమిలా ప్రజల రక్షణే మా ప్రాధాన్యం.. వాతావరణ సూచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.. ఇదీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ ప్రకటనలు.. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో నాలాలు, చెరువులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎల్బీనగర్ టీకేఆర్ కమాన్ దగ్గర ఓపెన్ డ్రైయిన్‌లో బైక్‌తో సహా ఫుడ్ డెలివరీ బాయ్ నాలాలో పడిపోగా, స్థానికులు రక్షించడంతో అపాయం తప్పింది.
యాకుత్‌ఫురా రైల్వే స్టేషన్ దగ్గరలో వరద కాలువలో యువకుడు గౌస్ కొట్టుకుపోగా, స్థానికులు రక్షించారు. బంజారాహిల్స్ రోడ్ నం 1లో నాలా రక్షణ గోడ కూలింది. కాగా, ఈ నెల 8న మల్కంచెరువు పొంగిపొర్లి ప్రధాన రహదారుల మీదకు వరద పోటెత్తింది. షేక్‌పేట చౌరస్తా వరకు వరద రావడంతో ట్రాఫిక్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడింది. వేసవిలోనే చెరువుల పరిరక్షణ, అలుగు, స్లూయిజ్ గేట్లు, ఇతర మరమ్మతు పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ చర్యలు చేపట్టలేదు.
ఫలితంగా మల్కం చెరువులోకి వచ్చిన వరద అలుగు ద్వారా మాత్రమే నీరు బయటకు వెళ్లింది. స్లూయిజ్ గేట్లు ఏర్పాట్లు చేస్తే ఫలితం మరోలా ఉండేది. ఒక్క మల్కంచెరువు కాదు..గ్రేటర్ చాలా చోట్ల చెరువులు నిండుకుండలా మారి ఆందోళనకరంగా మారింది. స్థానికులు, లోతట్టు ప్రాంతాల ప్రజల్లో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
చెరువుల సమీపంలో..
అసలే వరుణుడి విజృంభణ.. చెరువుల సమీపంలో ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన జీహెచ్ఎంసీ మేనమేషాలు లెక్కిస్తున్నది. వాస్తవంగా వర్షాకాలానికి రెండు నెలలు ముందుగానే పెద్ద చెరువులో వరద నీటిని నిల్వ చేసుకునేలా ప్లాన్ చేయాలి. ఎఫ్టీఎల్ (పూర్తి స్థాయి నీటి మట్టం) కంటే తక్కువ నీటి నిల్వ ఉండేలా చూసుకోవాలి. కుండపోత వర్షాలు కురిసిన చెరువు అలుగులు మత్తడి పోయకుండా చర్యలు చేపట్టాలి.
ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో సక్రమంగా ఉండేలా చూసుకోవాలి.. అవసరమైతే పరిస్థితులను బట్టి స్లూయిజ్ గేట్లు ఏర్పాటు చేసి వరదను దిగువకు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలి. కానీ ఘనత వహించిన జీహెచ్ఎంసీ చెరువుల్లోని నీటి మట్టాలను కనీసం తనిఖీలు చేయడం లేదు. చాలా వరకు చెరువులు నిండుకుండలా మారాయి. ముఖ్యంగా సరూర్‌నగర్ పెద్ద చెరువు, కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు, లింగంపల్లిలోని గోపి చెరువు, ఫాక్స్ సాగర్, నల్లగండ్ల ఇతరత్రా చెరువుల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది.
ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న దరిమిలా పక్కనున్న కాలనీలు, బస్తీలు నీటి మునిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు చెరువుల్లో నీటి మట్టం తనిఖీ చేస్తూ తూములు, అలుగుల ద్వారా నీరు దిగువకు వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడం..మరోవైపు లేక్ విభాగంలో ఇంజనీర్ల మధ్య సమన్వయ లేమి, ఎస్ఈ స్థాయి అధికారి లేకపోవడం చెరువుల పరిరక్షణ, వరద నీటి నివారణపై అధికారుల చిత్తశుద్ధికిఅద్దం పడుతున్నది.
మల్కంచెరువు ఘటనతోనైనా అప్రమత్తమై చెరువులపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. కాగా గతంలో వర్షాకాలంలో చెరువుకో పర్యవేక్షణ అధికారి ఉండేది..కానీ ప్రస్తుతం పర్యవేక్షణలోలోపాలు స్పష్టమవుతుండటం..వరుస ఘటనలే ఇందుకు నిదర్శనమని చెప్పాలి.
వరద కాలువలోకొట్టుకుపోయిన యువకుడు
యాకుత్‌ఫురా రైల్వే స్టేషన్ దగ్గరలోని వరద కాలువలో కొట్టుకుపోతున్న యువకుడిని స్థానికులు, హైడ్రా సిబ్బంది రక్షించారు. బుధవారం మేకల మేత కోసం చెట్టుకొమ్మలను తీసుకుని వచ్చేందుకు గౌస్ అనే స్థానికుడు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు వరద కాలువలోకి జారిపడిపోయాడు. స్థానికులు దగ్గరలోనే ఉన్న హైడ్రా సిబ్బందికి సమాచారమిచ్చారు.
కొందరు స్థానికులు అతనిని రక్షించడానికి ప్రయత్నించినా వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇబ్బందిగా మారాయి. అక్కడికి చేరుకున్న హైడ్రా ఇన్స్పెక్టర్ బాలగోపాల్ తన సిబ్బందితో కలిసి నిచ్చెన కిందకు వేసి యువకుడిని రక్షించే ప్రయత్నం చేశారు. రెయిన్‌బజార్ కార్పొరేటర్ వసీతో పాటు స్థానికుల సహకారంతో గౌస్‌ను రక్షించారు.