కేపీహెచ్బీ కాలనీ (హైదరాబాద్) : ఆరోగ్యమే మహాభాగ్యమని, మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా నగరంలో మొదటిసారిగా కూకట్పల్లిలో ప్రత్యేక పార్కులను అందుబాటులోకి తీసుకొచ్చామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Krishna Rao) అన్నారు.
కూకట్పల్లి రంగధాముని ( ఐడీఎల్) చెరువు గట్టుపై నేటి స్త్రీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 3కే రన్ వాక్థాన్ను (Walkathon) ఎమ్మెల్యే జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), మాజీ మంత్రి కేటీఆర్(KTR) సహకారంతో కూకట్పల్లి నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేక పార్కులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
ఈ పార్కులను మహిళలు, చిన్నారులు సద్వినియోగం చేసుకుంటున్నారని వెల్లడించారు. మహిళలకు అన్ని రంగాలలో రాణించే సత్తా ఉంటుందని, అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. అందుబాటులో ఉన్న పార్కులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని, నిత్యం వ్యాయామం, యోగా సాధన, నడకకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు 3కే రన్ వాక్థాన్ను నిర్వహించిన సంస్థ సభ్యులను అభినందించారు.