Hyderabad | బంజారాహిల్స్, ఆగస్టు 17 : యువతితో సహజీవనం చేసి పెండ్లికి నిరాకరించడమే కాకుండా దాడికి పాల్పడిన ఓ వైద్యుడిని ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం. 92లోని ఏషియన్ స్పైన్ ఆస్పత్రిలో బాచుపల్లికి చెందిన డాక్టర్ పోసినపల్లి రాజేందర్ రెడ్డి (35) ఆర్థోపెడిక్ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. 2024 సెప్టెంబర్‌లో మణికొండ పంచవటి కాలనీకి చెందిన మహిళా డిజైనర్ (28)తో ఏర్పడిన పరిచయం సహజీవనానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి మణికొండలోని ఆమె ఇంట్లోనే ఉంటున్నారు. కాగా, డాక్టర్ రాజేందర్ రెడ్డికి రెండేండ్ల క్రితమే వివాహం జరుగగా, ఆ విషయాన్ని దాచిపెట్టి డిజైనర్‌తో సహజీవనం చేస్తున్నాడు. పెండ్లి ఎప్పుడు చేసుకుంటావని సదరు యువతి ఆయన పనిచేస్తున్న ఆస్పత్రికి వెళ్లి నిలదీసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరుగగా, ఆమెను కొట్టడమే కాకుండా ఆమె ఫోన్‌ను సైతం నెలకేసి ధ్వంసం చేశాడు. ఆమెను నిర్భందించి వేదింపులకు గురిచేశారు. దీంతో బాధితురాలు అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేయగా, బీఎన్ఎస్ 79, 127(2), 115(2), 324(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.