Crime News | శేరిలింగంపల్లి, డిసెంబర్ 18 : పెళ్ళి చేసుకుంటానని నమ్మించి యువతుల కుటుంబ సభ్యుల వద్ద అందిన కాడికి దోచుకుని కనిపించకుండా తిరుగుతున్న నిత్య పెళ్ళి కొడుకు మీద రాయదుర్గం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. విగ్గులు పెట్టుకుని, వేషాలు మారుస్తూ పెళ్ళి పేరుతో గతంలో పదుల సంఖ్యలో మోసాలకు పాల్పడినట్లు తెలుస్తున్నది. ఓ యువతి కుటుంబ సభ్యులను సైతం పెళ్ళి పేరుతో మోసం చేసి వారి నుంచి రూ. 21లక్షలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న నిత్య పెళ్ళి కొడుకు మీద రాయదర్గుం పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఎస్ఆర్ నగర్ పోలీసుస్టేషన్లో సైతం ఇదే తరహాలో మోసానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు నిత్య పెళ్ళి కొడుకు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఖాజాగూడలో నివాసం ఉంటూ డాక్టర్‌గా పనిచేస్తున్న ఓ యువతి పెళ్లి సంబంధాల కోసం తన ప్రొఫైల్‌ను మ్యాట్రిమొనీ వెబ్సైట్లో ఉంచారు. ఆమె ప్రొఫైల్‌ను చూసిన రాయపాటి క్రిష్ణచౌదరి అనే వ్యక్తి వీరిని సంప్రదించాడు. తనకు ఆ యువతి ప్రొఫైల్ నచ్చిందని, పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు. తన తల్లిదండ్రులు రంగప్రసాద్ రావు, రాణిదేవిలతో పాటు తన సోదరి మాధురిలు ఆస్ట్రేలియాలో ఉంటున్నారని, తానొక్కడినే నగరంలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నానని యువతిని, యువతి కుటుంబాన్ని నమ్మించాడు.
తల్లిదండ్రులంటూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడించి..తమకు ఎటువంటి కట్న కానుకలు అవసరం లేదని నమ్మించి నిశ్చితార్థం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. యువతి కుటుంబం కూడా పెళ్లికి అంగీకరించింది. ఈ క్రమంలో వేర్వేరు వంకలతో సెప్టెంబర్ 28,29,31వ తేదీన యువతి ఇంటికి వచ్చిన క్రిష్ణచౌదరి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, నిశ్చితార్థం షాపింగ్ కోసం డబ్బులు సర్దుబాటు చేస్తే ఆస్ట్రేలియా నుంచి తన తల్లిదండ్రులు వచ్చిన తర్వాత తిరిగి ఇస్తానని చెప్పాడు.
అతని మాటలు నమ్మిన యువతి తండ్రి పలు దఫాలుగా రూ.19 లక్షల నగదు ఇవ్వడంతో పాటు 2.20 లక్షలకు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశాడు. డబ్బు తీసుకున్న నాటి నుంచి క్రిష్ణ చౌదరి ఫోన్లో అందుబాటులో లేకపోవడం, అడ్రస్ తెలియకపోవడంతో తాము మోసపోయినట్లు గుర్తించారు. ఈ మేరకు ఈ నెల 12వ తేదీన రాయదుర్గం పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా క్రిష్ణచౌదరి కోసం గాలింపు చేపట్టామని, గతంలో ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో సైతం ఇదే తరహాలో మోసానికి పాల్పడినట్లు గుర్తించినట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు. మరోవైపు క్రిష్ణచౌదరి విగ్గులు పెట్టుకుని, ఇదే తరహాలో పెళ్ళి పేరుతో పదుల సంఖ్యలో యువతుల కుటుంబాలను మోసం చేసినట్లు తెలుస్తుంది.