ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 6: ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ సికింద్రాబాద్ నియోజకవర్గ అభ్యర్థి తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ గెలుపు ఖాయమని పునరుద్ఘాటించారు. తార్నాక డివిజన్ పరిధిలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి, బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డితో కలిసి ఆయన సోమవారం విస్తృతంగా పర్యటించారు. డివిజన్లోని లాలాపేట, సత్యనగర్, లక్ష్మీనగర్, సిరిపురి కాలనీ, చంద్రబాబునగర్ తదితర ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో మహిళలు సంప్రదాయబద్ధంగా మంగళహారతులతో స్వాగతం పలకడంతో వివిధ ప్రాంతాలు గులాబీ మయంగా మారాయి. ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో బీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ గడిచిన యాభై ఏళ్లలో చేపట్టలేని అభివృద్ధి పనులను తాము కేవలం తొమ్మిదేళ్లలో పూర్తి చేశామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఉపకరించే సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా తాము చొరవ చూపి, ఏర్పాట్లు చేశామన్నారు. నియోజకవర్గంలో కొత్తగా జూనియర్, డిగ్రీ కళాశాలలను నెలకొల్పడంతో పాటు అనేక అభివృద్ధి పనులను చేపట్టామని చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు మరింత ప్రయోజనకారిగా నిలుస్తామని చెప్పారు. అన్ని రంగాల్లో సికింద్రాబాద్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కంది శైలజ, రాసురి సునీత, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.