గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై ఎల్‌నినో ప్రభావం చూపింది. గృహజ్యోతి కింద 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించిన వారికి జీరో బిల్లు వస్తుంది. అంటే వారు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆ తర్వాత ఒక్క యూనిట్ వినియోగించినా వారికి మొత్తం బిల్లు వస్తుంది. అయితే ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడమే కాకుండా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో వానాకాలంలోనూ ఉక్కపోత కొనసాగుతోంది. దీంతో ఇళ్లల్లో ఫ్యాన్లు, కూలర్ల వాడకం వేసవి మాదిరిగానే కొనసాగుతున్నదని టీజీఎస్పీడీసీఎల్ సిబ్బంది చెప్పారు.
-సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): వర్షాలు లేక భూగర్భజలాలు అంటడంతో ఇళ్లలోని మోటార్లు, బోర్లు నడిపే సమయం కూడా పెరిగిపోయింది. దీంతో నెలవారీ 200 యూనిట్ల వాడకం పరిమితి దాటుతోంది. దీంతో గృహజ్యోతి లబ్ధిదారులు జీరో బిల్లుకు దూరమవుతున్నారు. ఒక్కసారిగా మొత్తం బిల్లు చెల్లించాల్సి రావడంతో వారంతా కంగు తింటున్నారు. కొ న్ని చోట్ల ఈ బిల్లులను చూసి విద్యుత్ సి బ్బందితో గొడవలు పడుతున్న సందర్భా లు కూడా ఉన్నాయని క్షేత్రస్థాయి సిబ్బంది తెలిపారు. జీరో బిల్లులు రాకపోవడానికి తాము కారణం కాదని, ఒకవేళ యూనిట్లు రెండువందలు దాటిందంటే సాధారణంగా మొత్తం బిల్లు కట్టాల్సిందేనంటూ సిబ్బంది వారిని సముదాయించే ప్రయత్నం చేసినా లబ్ధిదారుల నుంచి నిరసన ఎదుర్కొనక తప్పడం లేదని వారు చెప్పారు.
ఎల్‌నినో ప్రభావంతో గత రెండునెలలుగా తీవ్ర ఉక్కపోత ఉంటోంది. జూన్, జూలైనెలల్లో గత సంవత్సరంతో పోలిస్తే 15శాతానికిపైగా విద్యుత్ డిమాండ్, వినియోగం పెరిగాయి. రికార్డు స్థాయిలో ఈ గణాంకాలు నమోదవుతుండడంతో డిస్కం ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. సహజంగా నమోదవ్వాల్సిన వర్షపాతం పూర్తిగా వర్షాభావ పరిస్థితులుగా మారడంతో గృహవినియోగదారులపై బిల్లుల భారం పడుతోంది. గ్రేటర్లో ఉక్కపోత కారణంగా ఇంటింటా విద్యుత్ వినియోగంతో మీటర్లు గిరగిరా తిరుగుతున్నాయి.
ఈ రీడింగ్ తీసుకోవడానికి వచ్చిన మీటర్ రీడర్లు మీరు పథకానికి అర్హులు కాదంటూ చెప్పడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లల్లో ఫ్యా న్లు, కూలర్లతో పాటు ఇతర వస్తువుల వినియోగం కూడా పెరగడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయితే తాము మొదట్లో చాలా పొదుపుగా వాడినప్పటికీ వాతావరణ పరిస్థితుల కారణంగా కరెంట్ వాడకం పెరిగిందని లబ్ధ్దిదారులే చెబుతున్నారు. ప్రతీ వేదికపై ఎల్‌నినో ప్రభావంతోనే ఉక్కపోత, కరెంట్ వినియోగం పెరిగాయని చెబుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, డిస్కం అధికారులు.. ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించడానికి యూనిట్ల పరిమితిని ఎందుకు పెంచడం లేదని ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సం గారెడ్డి జిల్లాల పరిధిలోని ఎస్పీడీసీఎల్ ప ది సర్కిళ్లలో 11.39లక్షల మంది గృహజ్యో తి లబ్ధ్దిదారులున్నారు. వారిలో గతంలో ప్రతీనెలా వంద యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే లక్షలమంది కనెక్షన్ దారులు గృహజ్యోతి పథకం వచ్చిన తర్వాత నుంచి ప్రతీనెలా 140-160 యూనిట్ల వరకు కరెంట్ వినియోగిస్తున్నారు. ఇటీవల వేసవి కాలంలోనే బిల్లుల విషయంలో కొంత ఇ బ్బందులు తలెత్తినా ఆ రెండు మూడు నెల లు కూడా జీరో బిల్లులు రాకుండా మొత్తం బిల్లు చెల్లించాల్సి వచ్చింది. అయితే వర్షాకాలంలో మళ్లీ పాత పరిస్థితే వచ్చి జీరో బిల్లులు వస్తాయని భావించినప్పటికీ మళ్లీ అదే తరహాలో బిల్లులు రావడంతో లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత 4నెలలుగా ఈ వినియోగం మరింత పెరిగి సుమారు లక్షన్నర లక్షల మందికి సాధారణ బిల్లులు వచ్చినట్లు తెలిసింది. వీరందరూ జీరో బిల్లులు రాక సతమతమవుతున్నారు. క్షేత్రస్థాయి డిస్కం సిబ్బంది మాత్రం ఖచ్చితంగా బిల్లులు చెల్లించాలని పట్టుబడుతున్నారు. ఈ విషయాన్ని ఎస్పీడీసీఎల్ అధికారికంగా ధృవీకరించకపోయినా బస్తీల్లో చాలామందికి ఫ్రీకరెంట్ పథకాన్ని కోల్పోయారని, 200 యూనిట్లు దాటితే వేలాది మంది ఉచిత బిల్లులు చెల్లించాల్సి వస్తున్నదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ పరిస్థితుల వల్ల ఈ గృహవినియోగం పెరిగిందని, దీంతో బిల్లు 200 యూనిట్లు దాటిందని, ప్రభుత్వం పథకం పరిమితిపై పునరాలోచించాలని వారు కోరుతున్నారు. ప్రధానంగా పాతబస్తీతో పాటు నగరంలోని పలు బస్తీ ప్రాంతాల్లో జీరో బిల్లులు రాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.