సిటీబ్యూరో, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఇప్పుడు భయం గుప్పిట్లో వణికిపోతున్నాయి, ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన కాలనీలు, వ్యాపార కేంద్రాలు, రాత్రి వేళల్లో నేడు దొంగల భయంతో ఆందోళనకు గురవుతున్నాయి. కాలనీలు, బస్తీలలో తాళం వేసిన ఇండ్లే కాదు, సాక్షాత్తూ ప్రధాన రహదారులను అనుకొని ఉన్న వ్యాపార సముదాయలను లక్ష్యంగా చేసుకొని దొంగలు చెలరేగిపోతున్నారు. దొంగలను అడ్డుకోబోతే అమాయక ప్రజలపై మరణాయుధాలతో దాడులకు సైతం తెగబడుతూ భయాందోళనలను సృష్టిస్తున్నారు.
రోజు రోజుకు పెరుగుతున్న ఈ నేరాల పరంపర వెనుక పోలీసుల నిఘా వైఫల్యం, పెట్రోలింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదనేది స్పష్టంగా కన్పిస్తోందని శివారు ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సొంత పనులకు ఊరికి వెళ్లి తిరిగి వచ్చిన ఒక కుటుంబం, తమ ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని చూసి షాక్ గురైంది. ఇంట్లోకి వెళ్లి చూడగా లోపల దొంగల అలికిడి విన్పించడంతో వారిని పట్టుకునేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే దొంగలు అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం ప్రయత్నించకుండా, కుటుంబ సభ్యులపై ఇనుప రాడ్లతో దాడి చేసి ఇంట్లో ఉన్న సొత్తును చోరీ చేసి పరారయ్యారు. తాళం వేసిన ఇండ్లకు భద్రత కరువయ్యిందని, తాళాలు పగలగొట్టి తరుచు ఇక్కడ దొంగతనాలు చేస్తున్నారంటూ స్థానిక ప్రజలు వాపోతున్నారు.
మరో వైపు చందానగర్‌లో పోలీస్‌స్టేషన్ పరిధిలో ముంబై జాతీయ రహదారి పక్కనే ఉన్న ఒక జ్యువెలరీ షాప్‌లో జరిగిన దోపిడీ పోలీసుల నిఘా డొల్లతనాన్ని తీవ్రంగా ఎండగడుతోంది. అర్ధరాత్రి వేళ దొంగలు పకడ్బందీ ఫ్లాన్‌తో జ్యువెలరీ షాప్ వెనుక నుంచి దుకాణంలోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను తొలగించి గోడకు పెద్ద రంద్రం చేసి దొంగలు లోపలికి ప్రవేశించారు. వెనుక గది నుంచి ప్రధాన షోరూమ్‌లోకి వెళ్లే తలుపులకు కన్నం చేసి లోప ఉన్న బంగారు, వెండి ఆభరణాలను చోరీచేశారు. నిరంతరం వాహనాల రాకపోకలు సాగే జాతీయ రహదారి పక్కనే గంటల తరబడి గోడలు తొలుస్తూ తలుపులు బద్దలు కొడుతుంటే పెట్రోలింగ్ వాహనాలు ఎక్కడ నిద్రపోతున్నాయంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పోలీసు యంత్రాంగానికి హైటెక్ సర్వైలెన్స్ ఉన్నాయంటూ గొప్పలు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం భదత్ర పూర్తిగా శూన్యంగా మారిందంటూ సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పన్నెండు గంటల దాటితే పోలీసు వాహనాలు ఎక్కడో ఓ దగ్గర నిలిపేసి అక్కడే అగిపోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అంతర్గతంగా ఉన్న కాలనీలు, బస్తీల్లోకి వెళ్లి పెట్రోలింగ్ చేసే నాథుడే కరువయ్యాడంటూ సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు. దొంగలు రోజుల తరబడి ఆయా ప్రాంతాలలో రెక్కీ నిర్వహిస్తున్నా పోలీసులు పసిగట్ట లేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యటించడం, పాత నేరస్థులపై నిఘా కొనసాగిస్తూ వారి వ్యవహారాలను ట్రాకింగ్ చేయాల్సిన అవసరముంటుందని ఆ విషయాన్ని పోలీసులు పక్కన పెట్టేశారనే విమర్శలు వస్తున్నాయి. నేరాలు అరికట్టేందుకు ఉన్నతాధికారులు నిరంతరం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నా క్షేత్ర స్థాయికి వచ్చే వరకు అమలులో మాత్రం నిర్లక్ష్యం చోటు చేసుకుంటుందనే విమర్శలు వస్తున్నాయి. నగర శివారు ప్రాంతాలలో మరింత పెట్రోలింగ్‌ను పెంచాల్సిన అవసరముంది. పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేసి నిరంతరం నిఘాను కొనసాగిస్తూ దొంగతనాలను అరికట్టాలంటూ ప్రజలు కోరుతున్నారు.