సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డును ఆనుకొని ఉన్న బుద్వేల్‌లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లో ప్లాట్ల విక్రయంపై ఆదివారం టీ హబ్‌లో ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ కిషన్‌రావు బుద్వేల్ లేఅవుట్ ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నగర శివారు ప్రాంతాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తూ, వందలాది ఎకరాల్లో మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తున్నదని, అందులో భాగంగానే కోకాపేట తర్వాత బుద్వేల్‌లోనూ 182 ఎకరాల్లో భారీ లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తున్నామని సీఈ బి.ఎల్.ఎన్.రెడ్డి తెలిపారు. ఈనెల 10వ తేదీన నిర్వహిస్తున్న ఆన్లైన్ వేలంలో మొత్తం 14 ప్లాట్లను వేలం వేస్తున్నామని, ప్లాట్ సైజులు కనీసం 3.47 ఎకరాల నుంచి గరిష్ఠంగా 14.3 ఎకరాలుగా ఉన్నాయన్నారు.
అనంతరం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ప్రతినిధులు ఆన్లైన్ వేలం విధానంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రీబిడ్ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రతినిధులు, బిల్డర్లు, నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులు అడిగిన సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. బుద్వేల్ లేఅవుట్‌ను ఆనుకొని ఎంతో ప్రతిష్టాత్మకమైన ఓఆర్‌ఆర్‌తోపాటు ఎయిర్‌పోర్టు మెట్రో రైలు ప్రాజెక్టు సైతం అనుసంధానంగా ఉండబోతున్నదని అధికారులు వివరించారు. ప్రధానంగా సముద్ర మట్టానికి చాలా ఎత్తయిన ప్రాంతంలో బుద్వేల్ లేఅవుట్ ఉంటుందని, ఇక్కడి నుంచి జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్ వ్యూ అద్భుతంగా కనిపిస్తుందని, ఐటీ కంపెనీలు, హోటల్స్, కమర్షియల్ భవనాలతో పాటు హైరైజ్ భవనాలను నిర్మించేందుకు అనుకూలంగా ఇక్కడి లేఅవుట్‌ను విశాలమైన రోడ్లతో అభివృద్ధి చేస్తున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో హెచ్ఎండీఏ కార్యదర్శి చంద్రయ్య, డైరెక్టర్ ప్లానింగ్ శ్రీనివాస్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎస్.కె.మీరా, సీఏఓ విజయలక్ష్మి, బుద్వేల్ సైట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అప్పారావు, జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.