తెలుగు యూనివర్సిటీ, జనవరి 2: నాటక రంగాన్ని పరిరక్షించే కళాకారులకు పురస్కారాలు మరింత బాధ్యతను పెంచుతాయని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో మహతి క్రియేషన్స్ ఆధ్వర్యంలో ప్రముఖ నాటక, టీవీ, చలనచిత్ర నటులు ఉప్పలూరి సుబ్బరాయశర్మ జన్మదినం సందర్భంగా రెండు రోజుల పాటు కొనసాగనున్న పంచమ సాంఘిక నాటకోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.
సద్గురు కళానిలయం సమర్పణలో మునిపల్లె విద్యాధర్ రచన బసవరాజు జయశంకర్ దర్శకత్వంలో కమనీయం నాటిక, శ్రీకృష్ణా తెలుగు థియేటర్స్ ఆధ్వర్యంలో ఏ.యన్ జగన్నాథశర్మ మూల కథ ఆధారంగా కస్తూరి రాజశేఖర్ నాటకీకరణలో డీ.వీ చంద్రశేఖర్ దర్శకత్వంలో పారిజాతం నాటికను కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. అనంతరం ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ అధ్యక్షతన జరిగిన సభలో ప్రముఖ నటి కే.ఇందిరను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, ప్రముఖ సాహితీవేత్త మద్ధాళి రఘురామ్ తదితరులు పాల్గొని ఘనంగా సత్కరించారు.