మియాపూర్, అక్టోబర్ 29: నేటి సమాజంలో ఇంటర్నెట్ అభివృద్ధితో ప్రభుత్వ పాలన, కీలకమైన విద్యా, వైద్య రంగాల సేవలు ఎంతగానో విస్తృతమయ్యాయని గవర్నర్ తమిళి సై పేర్కొన్నారు. పేద విద్యార్థుల కోసం రాజ్‌భవన్ వేదికగా పాతవి, వినియోగించని ల్యాప్‌టాప్‌ల సేకరణ జరుగుతున్నదని.. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ కోరారు. ఇంటర్నెట్ డేను పురస్కరించుకొని హైటెక్స్‌లోని మిలీనియం ఇన్ఫోటెక్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన గ్లోబల్ ఇగ్నైట్-2021 కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటర్నెట్ వినియోగంలో భారత్ రెండోస్థానంలో ఉన్నదన్నారు. డిజిటల్ ఇండియాగా మార్చేందుకు 2.4 లక్షల గ్రామాల ఇంటర్నెట్ సౌకర్యం కల్పించామని.. ఈ డిజిటల్ సేవల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తున్నదన్నారు. ఐటీ హబ్‌తో సహా ఇతర రంగాల్లో ఆదర్శ విజయాలు సాధిస్తున్నదని కొనియాడారు. కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి గూడ చంద్రయ్య, సంస్థ సీఈవో రమణ కోసూరి, ఎండీ లక్ష్మీకాంత్, దీప్తి రావుల, సురేశ్ చిట్టూరి, శాంతా సిన్హా, బెంజిమెన్ జోసెఫ్, ఐటీ నిపుణులు , విద్యార్థులు పాల్గొన్నారు.