సిటీబ్యూరో: రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన 300 డివిజన్ల పునర్విభజనను సర్కారు వ్యక్తిగత ధోరణిలో ముగించేసింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అన్నివర్గాలు ముక్తకంఠంతో వార్డుల విభజనపై అభ్యంతరాలు వెలిబుచ్చినా సర్కార్ మాత్రం పట్టించుకోకుండా గూగుల్ మ్యాప్ గీతలు గీసి విభజన ప్రక్రియను పూర్తిచేసింది. చివరకు ఫైనల్ గెజిట్ కూడా అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ అనుకూల పత్రికల్లో చిన్నపాటి ప్రకటనలతో విడుదల చేసి ముగింపు పలికింది. ఈమేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను 300 వార్డులుగా పునర్విభజన చేసినట్లు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
1996 వార్డుల పునర్విభజన నియమాల్లోని నియమం 11, జీవో నంబర్ 291 మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణ అభివృద్ధి విభాగంలోని నిబంధనల ప్రకారం జీహెచ్ఎంసీ వార్డులను 300కు పునర్విభజన చేసినట్లు అందులో పేర్కొంది. సరిహద్దుల వివరణలు, అన్ని సర్కిల్, జోనల్, ప్రధాన కార్యాలయ భవనాల నోటీస్ బోర్డుల్లో ఈ గెజిట్‌ను ఉంచతారని ఈ సందర్భంగా కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. పునర్విభజనకు సంబంధించి 300 వార్డుల పూర్తి వివరాలు జీహెచ్ఎంసీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. కానీ గురువారం అర్ధరాత్రి దాటినా జీహెచ్ఎంసీ అధికారిక వెబ్సైట్లో వివరాలు కానరాకపోవడం ప్రభుత్వం పనితీరును అద్దంపడుతున్నది.