సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): సృష్టి టెస్ట్‌ట్యూబ్ సెంటర్ కేసులో మరో వ్యక్తిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏజెంట్‌గా సరోగసీ పేరుతో పిల్లలను, దంపతులను డా.నమ్రత దగ్గరికి తీసుకురావడంలో కృష్ణ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించారని పోలీసులు చెప్పారు. ఆదివారం కృష్ణను పోలీసులు అరెస్ట్ చేయగా, ఇప్పటివరకు ఈ కేసులో అరస్టైన వారి సంఖ్య 12మందికి చేరింది.
విశాఖపట్టణంలోని ఏజెన్సీ ప్రాంతాలు, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో పిల్లలను విక్రయించే వారికోసం ఏజెంట్లు గాలిస్తున్నట్లు గుర్తించారు. ఎక్కువ మంది పిల్లలు కలవారిని, పేద కుటుంబాలు లక్ష్యంగా ఏజెంట్లు హర్షరాయ్, కృష్ణ, సంజయ్‌లు నమ్రత దగ్గరికి తీసుకొచ్చినట్లు పోలీసులు చెప్పారు. వీరు తాము సేకరించిన వివరాలు, వారితో మాట్లాడిన వ్యవహారమంతా హైదరాబాద్‌లోని సృష్టి రిసెప్షనిస్ట్ నందినికి అందించేవారని పోలీసులు పేర్కొన్నారు.
మూడవరోజైన ఆదివారం నమ్రత విచారణ కొనసాగగా ఏజెంట్లు ఎవరెవరు, ఆమె ట్రీట్మెంట్ ఇచ్చిన వారు ఇస్తున్న ఫిర్యాదులపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కల్యాణి, సంతోషిలను కూడా ఎక్కడెక్కడి నుంచి పిల్లలను సేకరించారు, గర్భిణులను ఎలా తీసుకొచ్చేవారు, వారికి సంబంధించిన వివరాలేంటి, తమ దగ్గర ఉన్న రెండు వందల మందిలిస్ట్లో ఉన్న వారి పేర్లతో చెక్‌చేస్తూ పోలీసులు విచారణ కొనసాగించినట్లు తెలిసింది. ఇదే సమయంలో సృష్టి కేసులో మరో రెండు ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.