Golkonda Bonalu | మెహిదీపట్నం, జూలై 5 : తెలంగాణ ఆషాఢ మాసం బోనాలను గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ ఆలయంలో నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, నగర పోలీస్ కమిషనర్ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, నగర సీపీ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కమిషనర్ విశ్వప్రసాద్, ఆర్డీవో మహిపాల్, దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి, ఏసీపీలు సయ్యద్ ఫయాజ్, ధనలక్షితో కలిసి లంగర్‌హౌస్ చౌరస్తా, గోల్కొండ కోటలో పర్యటించి బోనాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆదేశాలతో బోనాల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా చేపట్టడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
అంతకు ముందు నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బోనాలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని, సీసీ కెమెరాలతో శాంతి, భద్రతలను పర్యవేక్షిస్తామన్నారు. భక్తులకు గోల్కొండ చుట్టు పక్కల పార్కింగ్ ప్రాంతాల నుంచి సెట్విన్ బస్సుల్లో ఉచితంగా కోటకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ అష్వాక్ అహ్మద్, ఆలయ సలహాదారు సిరుగుమల్లె రాజు వస్తాద్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. గోల్కొండ బోనాలకు వచ్చే భక్తులకు జలమండలి తాగునీటి వసతి కల్పించింది. కోట ప్రారంభంలో ఉన్న మెట్ల దగ్గరి నుంచి మొదలుకుని బోనాలు జరిగే ప్రాంతం వరకు తాగునీటి పాయింట్లు ఏర్పాటు చేశారు.
గోల్కొండ కోటలో మెట్ల పూజ
ఆదివారం ఆషాఢ మాసం బోనాలు ప్రారంభం కానుండటంతో శుక్రవారం అమావాస్య కావడంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి మహిళలు గోల్కొండ కోటకు వచ్చి మెట్ల పూజలు చేశారు. ఈ సందర్భంగా కోట ప్రారంభం నుంచి అమ్మవారి గుడి వరకు ఉన్న మెట్లకు బొట్లు పెడుతూ, హారతి ఇచ్చి, అమ్మవారిని దర్శించుకున్నారు.