Minister Mallareddy | మేడ్చల్ రూరల్, జులై 6 : కులవృత్తుల సంక్షేమం, వారి ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని గౌడవెల్లిలో గురువారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 18 యూనిట్ల గొర్రెలను 18 మంది లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలో కులవృత్తుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నిరంతరం పాటుపడుతున్నారని అన్నారు.
మిషన్ కాకతీయతో నేడు 46 వేల చెరువులు నీటితో కలకలలాడుతున్నాయని, గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ, బెస్త కులస్తులకు చేప పిల్లల అందజేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నాడు చేపలను ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకునే వారమని, నేడు తెలంగాణలో మత్య్స సంపద పెరిగిందన్నారు. మాంసం కోసం ప్రతి రోజు మహారాష్ట్ర, నాగపూర్ తదితర ప్రాంతాల నుంచి వందల లారీలు నగరానికి వచ్చేవని, గొర్రెల పంపిణీ అనంతరం తెలంగాణ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని తెలిపారు. గొల్ల, కుర్మల్లో అర్హులైన వారికి గొర్రెలు పంపిణీ చేస్తామని మంత్రి చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, ఎంపీపీ రజితా రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజా రెడ్డి, మాజీ ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశ్, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు నందారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయనందరెడ్డి, ఉప సర్పంచ్ పెంటమ్మ, సొసైటీ చైర్మన్ సురేశ్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, నాయకులు రాజమల్లారెడ్డి, జగన్‌రెడ్డి, సంతోష్‌భాను, రవీందర్‌గౌడ్, హారత్రెడ్డి, రఘుపతిరెడ్డి, భాగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సరదాగా గొర్రెల వెంట తిరిగిన మంత్రి
లబ్ధిదారులకు అందజేసిన గొర్రెలు పెద్ద గుంపుగా కనిపించడంతో మంత్రి సంతోషంతో యాదవుల వద్ద ఉన్న గొంగడి వేసుకుని, కట్టెను చేత పట్టుకుని కాసేపు గొర్రెల మంద వెంట తిరిగారు. ఆశ్చర్యానికి గురైన నాయకులు కాసేపటి తర్వాత మంత్రి వెంట నడిచారు.
ఇతరుల వద్ద పని చేసే బాధ తప్పింది…
జీవనాధారం లేక పని కోసం వ్యవసాయ పనితో పాటు కూలీ పని చేసేవాడిని. సీఎం కేసీఆర్ గొర్రెలను అందించడంతో వాటిని సాకుతూ బతుకుతాను. ఇతరుల వద్ద పని చేసే బాధ తప్పింది. సీఎం మేలు మరువలేను.
-శ్రీశైలం యాదవ్, లబ్ధిదారుడు, గౌడవెల్లి
జీవనోపాధి దొరికింది
తెలంగాణ సర్కారు అందించిన గొర్రెలతో నాకు జీవనోపాధి దొరికింది. చేసుకునే పని లేక, గొర్రెలను కొనే స్తొమత లేక ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు ప్రభుత్వం అందించిన గొర్రెలతో నా కుటుంబానికి ఆధారం దొరికింది.
– సందపురం మల్లేశ్, లబ్ధిదారుడు, గౌడవెల్లి