టీడీఆర్‌పై బల్దియాకు నీతిఅయోగ్ ప్రశంసలు

- ‘ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్’ లో సత్తా చాటిన జీహెచ్ఎంసీ
- రికార్డుస్థాయిలో రూ. 3095.50కోట్ల విలువైన 807 టీడీఆర్‌లు జారీ
- వివిధ ప్రాజెక్టు పనుల పురోగతిలో సమర్థవంతంగా రాణింపు
- కమిషనర్, సీసీపీలకు మంత్రి కేటీఆర్ అభినందనలు
హైదరాబాద్ మహానగరంలో ప్రతి అంగుళం భూమి అత్యంత ఖరీదైనదే. మౌలిక సదుపాయాలు కల్పించాలంటే అవసరమైన చోట భూ సేకరణ తప్పదు. రోడ్డు విస్తరణ చేయాలన్నా ఎంతో కొంత స్థలం ఖరీదు చేయాల్సిందే. అలా చేయాల్సి వస్తే ప్రభుత్వం భారీగా ధనం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ వినూత్నంగా ఆలోచించి ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) పేరుతో కొత్త విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నది. ఈ పద్ధతిలో స్థలం కోల్పోయిన వారికి మార్కెట్ విలువ కన్నా నాలుగింతల ఆర్థికంగా ఊరట పొందే హక్కులు అందుతున్నాయి. జీహెచ్ఎంసీ అనుసరిస్తున్న ఈ విధానానికి దేశావ్యాప్తంగా గుర్తింపు దక్కింది. టీడీఆర్ పద్ధతి దేశానికే ఆదర్శమంటూ నీతి అయోగ్ ప్రశంసించింది. ఇతర రాష్ర్టాలు దీనిని అవలంబించాలని సూచించింది. రూ. 3095.50 కోట్ల విలువైన 807 టీడీఆర్‌లను రికార్డు స్థాయిలో జారీ చేసి.. సత్తాచాటిన జీహెచ్ఎంసీ ఇతర నగరాలకు ఓ కొత్త దారి చూపింది. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టు పనుల పురోగతిలో సమర్థవంతంగా రాణించిన జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ అభివృద్ధి పథకాలకై చేపట్టే భూ సేకరణ, ఆస్తుల సేకరణకు ఇచ్చే నగదు నష్ట పరిహారానికి బదులుగా ప్రవేశపెట్టిన ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్)లో జీహెచ్ఎంసీ సత్తా చాటింది. దేశంలో మరే నగరంలో జరుగని విధంగా రికార్డు స్థాయిలో 807 టీడీఆర్‌లను జారీ చేసింది. దీని విలువ రూ.3095.50కోట్లుగా ఉంది. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా భూసేకరణలకు నగదు ఇవ్వడానికి బదులుగా టీడీఆర్‌లు ఇచ్చే విధానాన్ని, టీడీఆర్ బ్యాంకును ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీని కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నీతి అయోగ్ ప్రశంసించింది. టీడీఆర్ విధానాన్ని ఇతర రాష్ర్టాలు కూడా అవలంబించాలని సూచించింది. కాగా, వివిధ ప్రాజెక్టు పనుల పురోగతిలో సమర్థవంతంగా రాణించిన జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు.
జీహెచ్ఎంసీకి మిగిలింది రూ.1500 కోట్లు
ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ ద్వారా రోడ్ల విస్తరణలో భాగంగా చేపట్టిన ఎస్ఆర్డీపీ, లింకు రోడ్ల నిర్మాణం, రహదారుల విస్తరణ, చెరువుల సుందరీకరణ, నాలాల విస్తరణకు 807 టీడీఆర్‌లు జారీ చేసి రూ.1500కోట్ల నగదు జీహెచ్ఎంసీకి మిగులుబాటయ్యేలా వెసులుబాటు కలిగింది. ఈ విధానంలో భూసేకరణకు, ఆస్తుల సేకరణకు నగదు మొత్తం అయితే.. మార్కెట్ విలువలో 200 శాతం అంటే.. టీడీఆర్‌ల రుపేణా 400శాతం అందిస్తారు. అయితే భూ సేకరణకు నగదు చెల్లించాల్సి వస్తే మార్కెట్ రేటుకు రెండింతలు ఇవ్వాల్సి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే రూ.1500కోట్లు చెల్లించాల్సి వచ్చేది. టీడీఆర్‌ల రుపేణా అయితే నాలుగు రేట్లు అందించాల్సి ఉంటుంది. దీని ప్రకారం రూ.3095.50కోట్ల విలువైన టీడీఆర్‌లను అందించింది.
డిమాండ్ పెరిగింది ఇలా..
- టీడీఆర్‌లను హెచ్ఎండీఏ పరిధిలోని ఔటర్ రింగు రోడ్డు వరకు వినియోగించుకునే వీలుందని ఇటీవల ఉత్తర్వులు వెలువడటంతో వీటికి మరింత డిమాండ్ పెరిగింది.
- టీడీఆర్‌లకు డిమాండ్ పెరుగడంతో ఈ విషయంలో మరింత పారదర్శకంగా ఉండేందుకు ఆన్లైన్ టీడీఆర్ బ్యాంకు ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో జీహెచ్ఎంసీ ఆన్లైన్ టీడీఆర్ బ్యాంకును ఏర్పాటు చేసింది. ఈ ఆన్లైన్ టీడీఆర్ బ్యాంకును మంత్రి కేటీఆర్ 20 ఫిబ్రవరి 2020న ప్రారంభించారు.
- ఈ టీడీఆర్ అప్లికేషన్ బ్యాంకు వివరాలను WWW.TDR.GHMC. TELANGANA.GOV.IN లో ప్రతి ఒక్కరూ చూసుకునే అవకాశం కల్పించారు. టీడీఆర్‌ల జారీ ఉపయోగించుకోవడం, విక్రయం తదితర వివరాలను ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. నగరవాసులు టీడీఆర్‌లను కొనడం, అమ్మడం వివరాలను కూడా ఈ విధానంలో పోస్ట్ చేసుకునే అవకాశం కల్పించారు.
మంచి స్పందన
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆన్లైన్ టీడీఆర్ బ్యాంకును జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం. పారదర్శకంగా టీడీఆర్‌లను జారీ చేస్తున్నాం. నాలుగు రెట్లు అధికంగా నష్ట పరిహారం చెల్లించడంతో భూ యజమానులు ఎంతో సంతోషంగా ముందుకొస్తున్నారు. ఫలితంగా ఇది విజయవంతంగా కొనసాగుతున్నది. ఎప్పటికప్పుడు మారుతున్న నిబంధనల మేరకు టీడీఆర్ విధానంలో మార్పులు తేవడంతో నగరంలో రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఊపు వచ్చిందని భావిస్తున్నాం. అతితక్కువ విస్తీర్ణంలో గరిష్ఠ మొత్తంలో నిర్మాణం జరిగే వీలున్నందున టీడీఆర్‌లను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆదరిస్తున్నారు. – దేవేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- GHMC
- ghmc roads
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

